Das_Ka_Dhamki_Rowdy_Alluduప్రపంచం మొత్తం ఏడు కథలే ఉన్నాయన్నది వాడకంలో ఉన్న నానుడి. వాటినే అటుఇటు తిప్పి మార్చుకోవాల్సిందే తప్పించి ఇప్పటిదాకా రానివి రాయనివి ఏవీ ఉండవంటారు కొందరు. అందులో నిజమెంతుందో పక్కనపెడితే పాత ఫార్ములాను లేదా బ్లాక్ బస్టర్లలోని కీలక పాయింట్లను తీసుకుని కథలను వండేసి కొంచెం ట్రీట్మెంట్ కొత్తగా జోడిస్తే చాలు అదే హిట్టు ట్రెండ్ గా మారిపోతుంది. ఇప్పటి జనరేషన్ దర్శకులు రచయితలు చేస్తున్నది అదే. ప్రేక్షకులకు ఎంత మెమరీ పవర్ ఉన్నా సరే స్క్రీన్ మీద మేజిక్ జరిగిపోతే చాలు ఇదెక్కడో చూశామని సంగతే మర్చిపోయి భలే ఉందని చూస్తున్నారు. భారీ కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి.

కొన్ని శాంపిల్స్ చూద్దాం. తాజాగా దాస్ కా ధమ్కీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అందులో విశ్వక్ సేన్ డబుల్ రోల్ చేశాడు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఒకటి క్లాస్ పాత్ర మరోటి మాస్ క్యారెక్టర్. ఎన్టీఆర్ రాముడు భీముడు, అక్కినేని ఇద్దరు మిత్రులతో మొదలు నిన్నటి రవితేజ ధమాకాలోనూ ఇదే ఫార్మాట్ కనిపిస్తుంది. రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ వీటినే మళ్ళీ తీసుకున్నా విశ్వక్ సేన్ ఇమేజ్ కి తగ్గట్టు ఆ పాత్రలకు మ్యానరిజం గట్రా జోడించాడు. నాగార్జున హలో బ్రదర్ లో సంగీత జబ్బుని ఇక్కడ రోహిణికి పెట్టడం, గోపీచంద్ గౌతమ్ నందాలో యాక్సిడెంట్ ని వాడుకోవడం అన్నీ జరిగాయి. చాలా ఫ్రేమ్స్ లో పోలికలు స్పష్టంగా కనిపించాయి.

ఇది ఒకరో ఇద్దరో చేస్తున్నది కాదు. స్ఫూర్తి చెందాలంటే ఎక్కడో హాలీవుడ్ నుంచి ఎత్తుకురావాల్సిన అవసరం లేదు. మనవే తరచి చూస్తే బోలెడు కనిపిస్తాయి. బన్నీకి ప్యాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిన పుష్ప పార్ట్ 1 ది రైజ్ లో ఎర్రచందనం దుంగలను డ్యామ్ నీటిలోకి విసిరేసి పోలీసుల కళ్ళు గప్పే సీన్ ఉందా. దీన్ని ఆడియన్స్ షాక్ అవుతూ చూశారు. అచ్చం ఇదే సన్నివేశం 1990లో వచ్చిన విజయ్ కాంత్ కెప్టెన్ ప్రభాకర్ లో చూడొచ్చు. త్రివిక్రమ్ సంగతి సరేసరి. విజయనిర్మల గారి మీనా అఆగా మారినా, వారసుడొచ్చాడులో పాయింట్ అతడుకి తీసుకున్నా, ఇంటిగుట్టుని అల వైకుంఠపురములోగా మార్చుకున్నా ఆయనలాగా ఇది అందరూ గెలిచే ఆట కాదు.

టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయాక ఫారిన్ సినిమాలు విచ్చలవిడిగా అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఫలానా సినిమా ఫలానా భాష నుంచి కాపీ కొట్టారని క్షణాల్లో పసిగడుతున్నారు. దాని బదులు ఇప్పటి తరం చూడటమే మానేసిన నలభై యాభై ఏళ్ళ క్రితం తెలుగు సినిమాలను తెలివిగా వాడుకుంటే అదిరిపోయే కథలు రాసుకోవచ్చు. మూగమనసులు నుంచి మగధీర ఆలోచన పుట్టుకొచ్చిందంటే కాదనగలరా. పసివాడి ప్రాణం వల్లే భజరంగి భాయ్ జాన్ రాశానని విజయేంద్ర ప్రసాద్ గారే స్వయంగా ఒప్పుకున్నారు. దీన్ని బట్టి అర్థమయ్యేందంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు. వాడుకోవడంలో తెలివితేటలు చూపించాలి అంతే