Visakhapatnam TDP MP Candidate Sri Bharat విశాఖపట్నం పార్లమెంట్ కు నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు, భరత్ పోటీ చేశారు. టీడీపీ సీనియర్ నేత, గీతమ్స్ కాలేజీ చైర్మన్ స్వర్గీయ మూర్తి మనవడు కావడం, సౌమ్యుడు, చదువుకున్న వాడు కావడం ఆయనకు కలిసొచ్చిన అంశం. అయితే ఆయన ఇక్కడ స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే దీనికి టీడీపీ అభిమానులు, ఓటర్లు తమను తామే నిందించుకుంటున్నారు. కారణం వారిలో కొందరు జనసేనకు క్రాస్ ఓటింగు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని గట్టెక్కించారు.

వివరాల్లోకి వెళ్తే… జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కు గాజువాకలో 58,539 ఓట్లు వచ్చాయి. సహజంగా అదే గాజువాక నుండి ఎంపీగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణకు అంతే ఓట్లు గానీ లేదా ఇంకొంచెం తక్కువ ఓట్లు గానీ రావాలి. మనం పవన్ కళ్యాణ్ తో పోలుస్తున్నాం కాబట్టి. అయితే ఇక్కడ జేడీ లక్ష్మీనారాయణకు 68,567 ఓట్లు వచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్ కంటే 10,028 ఓట్లు ఎక్కువ వచ్చాయి అన్నమాట. తెలుగుదేశం వారి ఓట్లు నిస్సందేహంగా కొన్ని జేడీ లక్ష్మీనారాయణ కు పడ్డాయి. జేడీ లక్ష్మీనారాయణ గతంలో జగన్ ను కేసులతో వేధించారు గనుక ఆ పార్టీ ఓటర్లు ఆయన వైపు మొగ్గే అవకాశాలు తక్కువ.

ఇదే సమయంలో భరత్ కేవలం 4,414‬ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఒక్క గాజువాకలోనే ఇంత క్రాస్ ఓటింగు ఉందంటే ఇక మిగతా చోట్ల ఊహించుకోవచ్చు. విశాఖపట్నం ఎంపీ కింద వచ్చే నాలుగు ఎమ్మెల్యే సీట్లలో గెలిచినా కూడా భరత్ ఓడిపోవడం గమనార్హం. జనసేన నుండి జేడీ లక్ష్మీనారాయణ కాకుండా వేరే ఎవరైనా పోటీ చేసి ఉంటే భరత్ కు లక్షకు తగ్గకుండా మెజారిటీ వచ్చేది. ఇదే సమయంలో జేడీ లక్ష్మీనారాయణ డిపాజిట్ దక్కించుకుని చాలా దూరంగా మూడవ స్థానంలో నిలిచారు.