visakhapatnam railway zoneవిశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఉత్తరాంధ్రవాసుల కల. దీనిని సాధించుకోవడానికి దశాబ్దాలుగా పోరాటాలు జరిగాయి. జోన్ కి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని విభజన చట్టంలో ఉన్నా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒడిశాలో రాజకీయంగా ఇబ్బంది అవుతుందని చాలా కాలం పక్కన పెట్టింది. అయితే ఎన్నికలకు ముందు కీలకమైన వాల్తేరు లేకుండానే మొక్కుబడిగా జోన్ ని ప్రకటించింది.

2019 ఫిబ్రవరి 27 విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రెండో ఓఎస్డీగా ధనుంజయులుని.. నియమించి… సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించాలని అదేశించింది. ఇందుకు అనుగుణంగానే జోన్ ఏర్పాటుకు సంబంధించిన డిపిఆర్ సిద్ధంచేసి సెప్టెంబర్ మొదటి వారంలో రైల్వే బోర్డుకు ఓఎస్డీ సమర్పించారు.

అయితే అక్కడ నుండి జోన్ ముందుకు కదలడం లేదు. ఇటీవలే విశాఖ రైల్వేజోన్ కార్యాచరణ… జీఎం నియామకం.. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎప్పటి నుంచి మనుగడలోకి వస్తుంది.. భూముల సేకరణ వివరాలు వెల్లడించాలని విశాఖ వాసి రైల్వే బోర్డుకు ఆర్టీఐ కింద సమాచారం కోరారు. దానికి ప్రస్తుతం డిపిఆర్ పరిశీలనలో ఉందని బోర్డు నుంచి సమాధానం వచ్చింది.

దీనిబట్టి ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అసలు కొందరైతే జోన్ పై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నిబద్దత మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా రాయగఢ్ డివిజన్, విశాఖ జోన్ ఏర్పాటుకు 170కోట్ల రూపాయలు అంచనాలు రూపొందించగా…. మూడు కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్లో ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.