Visakhapatnam preparing for the executive capitalరాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుపై విశాఖలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే జీఎన్ రావు కమిటీ రిపోర్టుని ఆమోదించి రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించబోతుంది ప్రభుత్వం. ఇందుకోసం విశాఖలో ప్రభుత్వ యంత్రాంగం తలమునకలై ఉంది. ప్రభుత్వ కార్యాలయాల కోసం ఖాళీ భవనాల కోసం అన్వేషిస్తుంది.

రాజధాని ఏర్పాటుకు ప్రస్తుతం కావలసినవి భవనాలే. ఇప్పటికిప్పుడు భారీ భవంతులు నిర్మించే యోచన ప్రభుత్వానికి లేదు. నెల రోజుల్లో వీలైనంత వరకు ఎన్ని కార్యాలయాలకు భవనాలు లభిస్తే…అన్నీ విశాఖపట్నం తరలించాలనేది యోచనగా కనిపిస్తోంది. ఆ మేరకు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది.

అందుకే కొన్ని శాఖల అధికారులు సొంతంగా విశాఖపట్నంలో తమ కార్యాలయాలకు భవనాలు సమకూర్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. రుషికొండ ఐటీ పార్కులోని మిలీనియం టవర్‌ -1లోనే సచివాలయం వస్తుందని విశ్వసనీయ సమాచారం. ఇందులో నాలుగు అంతస్థులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కిందనున్న మరో నాలుగు అంతస్థుల్లో కాండ్యుయెంట్‌ అనే ఐటీ కంపెనీ నడుస్తోంది.

ఇక్కడ లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులో ఉంది. దీనిపక్కనే టవర్‌-2 నిర్మాణం చకచకా జరుగుతోంది. ఇది పూర్తయితే మరో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది. ఈలోగా అవసరమైతే కొన్ని కార్యాలయాలు అద్దె భవనాలలో నడవబోతున్నాయి. ఇది ఇలా ఉండగా జనవరి నెలాఖరుకే వీలైనన్ని కార్యాలయాలు తరలించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.