విశాఖపట్నానికి రాజధాని తరలింపు ప్రక్రియ చేపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ మెట్రో ఫైనాన్సియల్ బిడ్ రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డీపీఆర్ సిద్ధం చేసేందుకు కొత్త కన్సెల్టెంటుకు బాధ్యతలు కూడా అప్పగించిన ప్రభుత్వం ఓపెన్ టెండర్ ద్వారా విశాఖ మెట్రో కు కొత్త టెండర్ ను పిలవాలని నిర్ణయించింది.

అయితే కేవలం ఒక్క బిడ్‌ మాత్రమే దాఖలైంది. ఇస్సెల్‌ ఇన్‌ఫ్రా కన్సార్టియం ఈ బిడ్‌ను దాఖలు చేసింది. దీంతో ఫైనాన్సియల్‌ బిడ్‌ను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని మీద వచ్చే నెలాఖరుకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత రాజధాని అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని నూతన డీపీఆర్ సిద్ధం చేసే అవకాశం ఉందంటున్నారు.

కేంద్రం విజయవాడ, విశాఖపట్నం మెట్రోలు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉంది. అయితే కేంద్రం మెట్రో పాలసీ మార్పు పేరిట తన బాధ్యతను ఎగ్గొట్టింది. గత ప్రభుత్వం సొంతగానైనా ఈ ప్రాజెక్టులను ముందుకు నడిపించాలని పలు ప్రయత్నాలు చేసే ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆ పనులు ముందుకు సాగలేదు.

అప్పులు కూడా తెచ్చే ప్రయత్నాలు చేసినా ముందుకు సాగలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కథ అంతా డీపీఆర్ నుండి ముందుకు వచ్చినట్టు అయ్యింది. దీనితో ట్రాఫిక్ బాధలతో ఇబ్బంది పడుతున్న విశాఖ వాసుల కల మరి కొన్ని రోజులు వాయిదా పడనుంది.