visakhapatnam gas leakage effect will remain for a decadeవిశాఖపట్నం గ్యాస్ లీక్ ఘటన ఇప్పటివరకూ పదకొండు మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పటివరకు ఆసుపత్రిలో చేరిన 554 మందిలో 128 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన వారిలో 52 మంది పిల్లలతో సహా 426 మంది కెజిహెచ్ మరియు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులలో ఉన్నారు. గ్యాస్ ని నిర్వీర్యం చెయ్యడానికి నిపుణులను రంగంలోకి దించింది కేంద్రం.

ప్రస్తుతానికి గండం తప్పినట్టే అంటున్నారు. లీకేజీ అరికట్టినంత మాత్రాన సమస్య తొలగిపోయినట్టు కాదని, ఈ ప్రభావం విశాఖపట్నం మీద దీర్ఘ కాలం ఉంటుందని అంటున్నారు నిపుణులు. ఈ ప్రమాదం పర్యావరణంపై దశాబ్దం పాటు ప్రభావం చూపుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

“పాము కాటు అంతటి తీవ్రమైన విష వాయువు ఇది. ఈ వాయువు పక్షులు, పశువులపై తక్షణ ప్రభావం చూపుతుంది. కంటి చూపు, మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది,” అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి పరిశ్రమలు జనావాసాలు ఉన్న చోట ఉండకూడదని వాటిని తక్షణం తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

“విపత్తు జరిగితే ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రభుత్వం దగ్గర కూడా ముందస్తు ప్రణాళికలు లేవు. కొన్ని సంవత్సరాలుగా పర్యావరణవేత్తలు చెబుతున్నా ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఏదైనా పరిశ్రమ నెలకొల్పే ముందు దానికి సంబంధించిన ఆసుపత్రి, చికిత్స చేసేందుకు వైద్యులను అందుబాటులో ఉంచాలి,” అని కూడా వారు సలహా ఇస్తున్నారు. అయితే ప్రభుత్వాలు మాత్రం ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి.