Virus Vs Bacteria Latest Scientistsమనుషులు మాటల ద్వారా సంభాషించుకుంటే… జంతువులు తమ తమ పద్ధతుల్లో కమ్యూనికేషన్ ను కొనసాగిస్తాయి. అలాగే ‘వైరస్’లు కూడా మాట్లాడుకుంటాయట. ఇజ్రాయిల్ లోని వెయిజ్మన్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తేల్చారు. అయితే ఈ సంభాషణలు రసాయన క్రియల రూపంలో ఉంటాయని చెప్తున్నారు. అమైనో ఆమ్లాలను విడుదల చేయడం, గ్రహించడం ద్వారా ఈ సంభాషణలు సాగుతాయని వారు అంటున్నారు.

శరీరంలోని జీవక్రియకు ఉపయోగపడే బాక్టీరియా ఉంటుంది. ఈ బాక్టీరియా నాశనమైతే అనారోగ్యానికి గురవుతుంటాం. ఒక బాక్టీరియాను చంపాలా? లేక దాని శక్తిని హరించాలా? అన్నది తేల్చేది ఈ సంభాషణలేనని వారు పేర్కొంటున్నారు. ఏదైనా బాక్టీరియాను వైరస్ లు నాశనం చేయాలనుకుంటున్నప్పుడు కొంచెం కొంచెం రసాయనాలను విడుదల చేయడం ద్వారా మూకుమ్మడిగా దాడికి దిగుతాయని, తద్వారా దానిని నాశనం చేస్తాయని వారు వెల్లడించారు.

అలా కాకుండా బాక్టీరియాను నిర్వీర్యం చేయాలనుకుంటే మాత్రం వైరస్ లు పెద్ద మొత్తంలో రసాయనం విడుదల చేస్తాయని, తద్వారా దానిని నిర్వీర్యం చేస్తాయని పేర్కొన్నారు. ఈ పరిశోధనలను అతి పెద్ద మైలురాయిగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వైరస్ ల నుంచి సంక్రమించే వ్యాధులను పరిష్కరించేందుకు ఈ పరిశోధనలు ఎంతో ఉపయోగపడతాయని వారు అభిప్రాయపడ్డారు.