Sakshi Malik, Virender Sehwag Congratulate Sakshi Malik, Cricketer Virender Sehwag Congratulate Sakshi Malik, Virender Sehwag Congratulate Wrestler Sakshi Malik,రియో ఒలింపిక్స్ మహిళల రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత్ కు కాంస్య పతకం అందించిన సాక్షి మాలిక్ ను అభినందిస్తూ టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్ దేశం మొత్తాన్ని అకట్టుకుంటోంది. ‘ఆడ పిల్లలను పురిట్లోనే చంపకుండా ఉంటే ఏం జరుగుతుందో సాక్షి మాలిక్ గుర్తు చేసింది. క్రీడల్లో మన దేశానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మన బాలికలు వెళ్లి, మన దేశ గౌరవం కాపాడారని’ సెహ్వాగ్ చేసిన ట్వీట్ కు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

రియోలో పతకం సాధించడంతో సాక్షి మాలిక్ గురించి దేశం మొత్తం మాట్లాడుతోందని, బాలికలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఎవరూ మాట్లాడకపోవడం శోచనీయమని ట్విట్టర్ లో సెహ్వాగ్ పేర్కొన్నాడు. అక్షర సత్యాలు కావడంతో, అందరూ సెహ్వాగ్ అభిప్రాయాలతో ఏకీభవిస్తూ మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా సాక్షి మాలిక్ సొంత రాష్ట్రంలో ఉన్న భ్రూణ హత్యలను పరిగణనలోనికి తీసుకుంటే… సెహ్వాగ్ ట్వీట్ ను ‘శభాష్’ అని మెచ్చుకోక మానరు.

సాక్షి మాలిక్ సొంత రాష్ట్రమైన హర్యానాలో భ్రూణహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హర్యానాలో ప్రతి 1000 మంది బాలురకు 873 మంది బాలికలు మాత్రమే ఉండడం భ్రూణహత్యల తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో ఆడపిల్లలపై వివక్ష చూపొద్దని సెహ్వాగ్ చేసిన విజ్ఞప్తి అందర్నీ ఆకట్టుకుంటోంది.