Virat Kohli To break Sachin Tendulkar Test match recordsటీమిండియా కెప్టెన్ మరో రికార్డుకు చేరువయ్యాడు. ఇంగ్లండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా, నాలుగో టెస్టు జరుగుతున్న వేళ, సచిన్ టెండూల్కర్ మరో రికార్డు బద్ధలయ్యే అవకాశం పుష్కలంగా కనపడుతోంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ మరో ఆరు పరుగులు చేస్తే, టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని అందుకుంటాడు. సచిన్ తన కెరీర్ లో 6 వేల పరుగుల మైలురాయిని చేరేందుకు 120 ఇన్నింగ్స్ తీసుకోగా, కోహ్లీకి నేటితో 119వ ఇన్నింగ్స్ అవుతుంది.

అంటే నేడు కోహ్లీ బ్యాటింగ్ కు వచ్చి 6 పరుగులు చేస్తే, సచిన్ రికార్డు కనుమరుగవుతుంది. ఇప్పటివరకూ 69 టెస్టులాడిన కోహ్లీ, 118 ఇన్నింగ్స్ లో 5,994 పరుగులు చేశాడు. నేడు కోహ్లీ ఆరు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్ల జాబితాలో చేరుతాడని అభిమానులు భావిస్తున్నారు. కాగా టెస్టుల్లో 6 వేల పరుగులను అత్యంత త్వరగా పూర్తి చేసిన వారిలో సర్ డాన్ బ్రాడ్ మన్ అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన కేవలం 68 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించారు.

ఇక నాలుగవ టెస్ట్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఒకానొక దశలో 89 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకున్న ఇంగ్లాండ్ ను, బౌలర్ కం బ్యాట్స్ మెన్ అయిన కరణ్ 78 పరుగులతో ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోర్ కు చేరుకోగలిగింది. చివరి వరుసలో అలీ 40, బ్రాండ్ 17 పరుగులతో కరణ్ కు అండగా నిలిచారు. భారత బౌలర్లలో బూమ్రా 3 వికెట్లు పడగొట్టగా, ఇషాంత్, షమీ, అశ్విన్ లు చెరో 2 వికెట్లను సాధించారు.