Virat Kohli steps down as India Test captainటీ20 మ్యాచ్ లకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పిన సమయంలో ఏర్పడిన వివాదం తెలియనిది కాదు. టీ20 నుండి విరాట్ తప్పుకుంటే, వన్డే మ్యాచ్ ల నుండి బీసీసీఐ విరాట్ ను కెప్టెన్ గా తప్పించడం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. కెప్టెన్సీ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని విరాట్ చెప్పగా, కోహ్లీకి చెప్పినా వినలేదని బీసీసీఐ పెద్దలు చెప్పుకొచ్చారు.

అయితే అదంతా గతం. తాజాగా మరొక బాంబ్ పేల్చారు కోహ్లీ. టెస్ట్ కెప్టెన్సీకి కూడా విరాట్ గుడ్ బై చెప్పడం షాకింగ్ గా మారింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్ట్ లను 2-1 తేడాతో టీమిండియా చేజార్చుకున్న విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ ను గెలిచి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, చివరి రెండు టెస్ట్ లలో పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో సిరీస్ ను చేజార్చుకుంది.

దీంతో కలత చెందిన కోహ్లీ, టెస్ట్ కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియా ద్వారా తన భావాలు పంచుకున్నారు. ఏడేళ్లుగా ఎంతో బాధ్యతతో తన విధులను నిర్వహించానని, ఫీల్డ్ లో ఉన్న సమయంలో ఏనాడూ విజయంపై అపనమ్మకం లేదని, 100కి 120 శాతం కష్టపడ్డానని, తనకు ఈ అవకాశం కల్పించినందుకు బీసీసీఐకు కృతజ్ఞతలు తెలిపారు.

తన ఈ జర్నీలో రవిశాస్త్రి ఇచ్చిన సహకారం మరువలేనిదని చెప్పిన విరాట్, తనలో నాయకత్వ లక్షణాలను ఉన్నాయని నమ్మిన ఎం.ఎస్.ధోనికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. అలాగే ఇన్నేళ్ల టీమిండియా విజయ ప్రస్థానంలో సహకరించిన తోటి క్రికెటర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపిన విరాట్ మాటల్లో వైరాగ్యం, ఆవేదన స్పష్టంగా తెలుస్తోంది.

బీసీసీఐ ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీ వచ్చిన తర్వాత టీమిండియాలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో ప్రధానమైనది, అతి ముఖ్యమైన అంశం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయం. టీమిండియాకు అద్వితీయమైన విజయాలను అందించిన ‘ఛేజింగ్ స్టార్’ విరాట్ ను, కెప్టెన్సీని వదులుకునేలా చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ విషయంలో బీసీసీఐ ఇంత అవమానకర రీతిలో వ్యవహరించాల్సింది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే గత కొన్నాళ్లుగా బ్యాటింగ్ లో విఫలం అవుతోన్న విరాట్ కు ఈ కెప్టెన్సీ భారం మంచి విషయమే. సెంచరీ అంటే అవలీలగా చేసే విరాట్ బ్యాట్ నుండి గత ఏడాదిన్నర్రగా ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదంటే, ఎంత ఒత్తడిలో విరాట్ ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. కెప్టెన్ గా వదులుకున్నా, ఆటగాడిగా కొనసాగుతారు గనుక, మునుపటి విరాట్ కోహ్లీ షాట్స్ కావాలంటున్నారు క్రికెట్ అభిమానులు.