virat-kohli opens on rift with anil kumbleఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్తాన్ చేతిలో ఓటమి టీమిండియాను ఇంకా వెన్నాడుతూనే ఉంది. ముఖ్యంగా కుంబ్లే ఎపిసోడ్ హైలైట్ గా నిలవడంతో, విరాట్ కోహ్లిపై విమర్శకులతో పాటు, క్రికెట్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. అయితే వారికి మరింత మండించే విషయం తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే తారాస్థాయికి చేరిన కుంబ్లే – కోహ్లి మధ్య ఎపిసోడ్ లో ఇది అత్యంత కీలకమైన విషయంగా మారింది.

కుంబ్లేపై పెంచుకున్న వ్యక్తిగత కక్ష్యతో ఏకంగా దేశాన్నే అవమానపరిచే విధంగా కోహ్లి ప్రవర్తించాడన్న విషయం జాతీయ మీడియాలో హైలైట్ అవుతోంది. ఫైనల్స్ లో టాస్ నెగ్గడం అనేది చాలా కీలకమైన విషయం. టాస్ గెలిస్తే ఆయా జట్లు ఏం నిర్ణయించుకోవాలి అనే దానిపై ముందుగానే ఒక నిర్ణయం తీసుకుంటారు. టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న కుంబ్లే కూడా తన నిర్ణయాన్ని విరాట్ కోహ్లి ముందుగానే చెప్పాడన్న విషయం కలకలం రేపుతోంది.

టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లికి కుంబ్లే సూచించగా, కుంబ్లే వ్యాఖ్యలను ఖాతరు చేస్తూ, టాస్ గెలిచినా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడని మీడియా వర్గాలలో హల్చల్ చేస్తున్న విషయం. తన వ్యక్తిగత కక్ష్యతో దేశం పరువు తీసాడని కోహ్లిపై పడుతున్న విమర్శలకు కొదవలేదు. ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే, అది వేరే రకంగా ఉండాలి గానీ, ఈ రీతిలో ఉండకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇలా వెలుగులోకి వస్తున్న ఒక్కో విషయం విరాట్ కోహ్లిపై ఇప్పటివరకు ఉన్న గౌరవభావాలకు భంగం కలిగించేవిగా ఉన్నాయని చెప్పవచ్చు. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందనేది స్వయంగా కోహ్లి గానీ, కుంబ్లే గానీ చెప్తే తెలియదు. ఏది ఏమైనప్పటికీ, ఒకే ఒక్క ఓటమి టీమిండియాలో ఉన్న లొసుగులను బయటకు తీసి ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రతి చోటా నీచ రాజకీయమే రాజ్యమేలుతోందని అవగతమైంది..!