టీ20 సిరీస్ ను 2-1తో కైవసం చేసుకుని మంచి జోష్ మీదున్న టీమిండియా, వన్డే సిరీస్ ను కూడా అంతే ఘనంగా ఆరంభించింది. మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచ్ ను కైవసం చేసుకుని 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయం విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డును చేర్చింది. కెప్టెన్ గా 50 వన్డేల తర్వాత 39 విజయాలు అందుకుని, దిగ్గజ కెప్టెన్లు పాంటింగ్, లాయడ్ ల సరసన నిలిచాడు. 50 వన్డేలలో 39, 35 టెస్ట్ లలో 21, 17 టీ20లలో 11 విజయాలతో మొత్తమ్మీద ఇండియా తరపున మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రూపాంతరం చెందాడు.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 268 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు ఇద్దరూ తొలి 10 ఓవర్లలో 73 పరుగులతో మంచి ఓపెనింగ్ ను ఇవ్వడంతో భారీ స్కోర్ దిశగా సాగుతోన్న ఇంగ్లాండ్ పతనాన్ని కులదీప్ యాదవ్ శాశించాడు. తొలి టీ 20ని ఎలా అయితే మలుపు తిప్పాడో, ఈ మ్యాచ్ ను కూడా అదే విధంగా 6 వికెట్లతో టీమిండియా సొంతం చేసాడు. 10 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లను సొంతం చేసుకున్న కులదీప్, మ్యాన్ ఆఫ్ ది ,మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇక లక్ష్య చేధనను ఏ మాత్రం తడబడకుండా టీమిండియా బ్యాట్స్ మెన్లు ముగించారు. శిఖర్ ధావన్ (40) పరుగులు చేసి అవుట్ కాగా, కెప్టెన్ విరాట్ కోహ్లి 75 పరుగులతో సత్తా చాటాడు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ 114 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయమైన 137 పరుగులు చేసి, కేవలం 40.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకునేలా చేసాడు. మూడవ టీ20లో సెంచరీ చేసిన రోహిత్ శర్మకు, ఇంగ్లాండ్ గడ్డపై ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం.