virat-kohliభారత జట్టు క్రికెట్ లో అడుగుపెట్టిన నాటి నుండి ఇప్పటివరకు సాధించని రికార్డును కోహ్లి సేన అలవోకగా అందుకుని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఇంతవరకు వెస్టీండీస్ లో రెండు గెలుపులు అంటే తెలియని టీమిండియాకు తొలిసారిగా ‘డబుల్ విక్టరీ’ని అందించాడు దూకుడైన కెప్టెన్ కోహ్లి. అలాగే గత రెండు పర్యటనలలో ఒక్కో విక్టరీని అందుకుని హ్యాట్రిక్ విజయాల కోసం వెళ్ళిన జట్టుకు, ఆ ముచ్చట కూడా తీర్చి అభిమానులను ఫుల్ ఖుషీలోకి నెట్టాడు.

మూడవ రోజు మొత్తం వర్షార్పణం కావడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని భావించిన క్రీడా పండితులకు షాక్ ఇచ్చి, అల్ రౌండ్ ప్రతిభతో సత్తా చాటింది టీమిండియా. నాలుగవ రోజు భువనేశ్వర్ కుమార్ మ్యాజిక్ స్పెల్ మ్యాచ్ ను మలుపు తిప్పగా, ఆ తర్వాత వేగంగా పరుగులు చేసి, 217 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో 346 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ జట్టు కేవలం 47.3 ఓవర్లలోనే చాపచుట్టేసి మ్యాచ్ ను టీమిండియా వశం చేసింది.

బౌలింగ్ లో అందరూ సమిష్టిగా రాణించడంతో విజయం సులభం అయ్యింది. భువనేశ్వర్ కుమార్ 1, షమి 3, ఇషాంత్ శర్మ 2, జడేజా 2, అశ్విన్ 1 వికెట్ తో తమ ప్రతిభ చూపారు. ఈ విజయంతో కోహ్లి పేరు మరోసారి మారుమ్రోగుతోంది. సచిన్, గంగూలీ, ద్రావిడ్ వంటి హేమాహేమీలు ఉన్నప్పుడు కూడా సాధించలేని విజయం వశం కావడంతో, జట్టును ఎంపిక చేసిన సెలక్టర్లు కూడా ఫుల్ ఖుషీలో మునిగితేలుతున్నారు.