Virat-Kohli---India-Vs-South-Africaవిరాట్ కోహ్లి… మరో మాట చెప్పాలంటే ప్రత్యర్ధి బౌలర్ల పట్ల సింహ స్వప్నం. క్రీజులోకి వచ్చాడంటే ఒక పట్టాన వెళ్ళట్లేదు. హీనపక్షంగా ఓ సెంచరీ చేసే వరకు క్రీజు వదిలే ప్రసక్తే లేదు అన్న విధంగా బ్యాటింగ్ చేస్తుండడంతో, బహుశా ఇతర జట్ల నుండి ఓ ప్రతిపాదన వచ్చినా రావొచ్చేమో! ‘విరాట్ కోహ్లి టీంలో ఉంటే తాము ఆడబోమని’ చెప్తారేమో! చదవడానికి, వినడానికి కాస్త అతిశయోక్తిగా ఉన్నా… విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఇలాగే ఉంటోంది మరి!

జరిగిన మూడు వన్డేలను పరిశీలిస్తే… మొదటి వన్డేలో సూపర్ సెంచరీతో మ్యాచ్ ను గెలిపించగా, రెండవ వన్డేలో అర్ధ సెంచరీ దరిదాపుల్లోకి వచ్చేపాటికి టీమిండియా విజయం సాధించేసింది. ఇక సిరీస్ లో అత్యంత కీలకమైన మూడవ వన్డేలో… సున్నా వద్ద ఎంపైర్ అవుట్ అని ప్రకటించగా, రివ్యూ కోరిన కోహ్లి, నాటౌట్ తీసుకుని చివరి రెండు బంతులను సిక్సర్, బౌండరీగా మలిచి, అజేయంగా 160 పరుగులతో నిలిచాడు. దీంతో టీమిండియా స్కోర్ 303కు చేరుకుంది.

విరాట్ కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్ ను మినహాయిస్తే… శిఖర్ ధావన్ (76) మినహా మిగతా బ్యాట్స్ మెన్లు రాణించలేకపోయారు. విరాట్ కోహ్లి గత ఆరు ఇన్నింగ్స్ లను పరిశీలిస్తే… అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఒక్కసారి మాత్రమే తక్కువ స్కోర్ 29 పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ రకంగా సెంచరీల మీద సెంచరీలు చేస్తే… ప్రత్యర్ధి టీంలు బాయ్ కాట్ చేస్తాయేమో… అన్నంతగా సెంచరీలతో చెలరేగిపోతున్నాడు.