Virat Kohli hits againటోర్నీలో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కెప్టెన్ కోహ్లీ ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. మ్యాచ్ లో అంతా తానై జట్టును నడిపించిన కోహ్లీ స్పూర్తివంతమైన విజయం అందించి, తన ప్రతిభ ఏంటో మరోసారి చాటిచెప్పాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రైజింగ్ పూణే సూపర్ జయింట్స్ జట్టు రహానే (74), సౌరభ్ తివారీ (52) అండతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.

భారీ లక్ష్య చేధనలో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగళూరు జట్టుకు కోహ్లీ, కేఎల్ రాహుల్ శుభారంభం అందించారు. ఆచితూచి ఆడిన రాహుల్ (38)ను అండగా చేసుకున్న కోహ్లీ తొలుత ఇన్నింగ్స్ ను జాగ్రత్తగా ఆరంభించాడు. రాహుల్ ను అవుట్ చేసిన స్పిన్నర్ జంపా, ఆ వెనువెంటనే విధ్వంసకర ఆటగాడు డివిలియర్స్ (1) ను కూడా అదే ఓవర్లో పెవిలియన్ కు పంపి, బెంగళూరు మళ్లీ కష్టాల్లో పడేసేలా కనిపించాడు.

దీంతో రంగప్రవేశం చేసిన షేన్ వాట్సన్ రెచ్చిపోయి 13 బంతుల్లో 36 పరుగులు చేసి మ్యాచ్ బెంగుళూరు వైపుకు తిప్పాడు. వాట్సన్, కోహ్లి ఇద్దరూ పోటాపోటీగా బ్యాటింగ్ చేస్తూ ఫోర్లు, సిక్సర్లు బాదడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. ఈ దశలో వాట్సన్ ఔటైన, మరో పక్క చెక్కు చెదరని దీక్షతో 18 వ ఓవర్ లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు, 19వ ఓవర్లో రెండు సిక్సర్లతో విరుచుకుపడడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం ఖరారు చేశాడు.

ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసిన కోహ్లి (108) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కోహ్లీ నిలిచాడు. భారీ స్కోర్ సాధించి కూడా విజయం అంచులకు రాకపోవడంతో కుదేలైన ధోని టీం దాదాపుగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ బరిలో నుండి తప్పుకున్నట్టే. మరో వైపు శివాలెత్తిన కోహ్లి ప్రతిభతో బెంగుళూరు జట్టును ప్లే ఆఫ్స్ బరిలో నింపారు.