Virat-Kohliక్రీజులోకి అడుగుపెట్టిన రెండవ బంతికే అవుట్ కావాల్సిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, దాని నుండి బయట పడడంతో, ఏకంగా మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పి, ఆరు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలబెట్టాడు. 270 పరుగుల భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ (20) పరుగులు చేసి వెనుదిరిగిన తర్వాత క్రీజులోకి అడుగు పెట్టిన కోహ్లి, తను ఎదుర్కొన్న రెండవ బంతికి స్లిప్ లో క్యాచ్ ఇచ్చాడు.

కాస్త కష్టసాధ్యమైన ఆ క్యాచ్ ను ఒడిసి పట్టుకోవడంలో విఫలమైన సఫారీ ఫీల్డర్ కు తగిన మూల్యం చెల్లించే విధంగా మరో అవకాశం ఇవ్వకుండా సెంచరీతో కధం తొక్కాడు. ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (35) రనౌట్ రూపంలో వెనుదిరగగా, క్రీజులోని వచ్చిన రహనే (79), కెప్టెన్ కోహ్లితో కలిసి లక్ష్య చేధన వైపుకు తీసుకెళ్ళాడు. వీరిద్దరి 189 పరుగుల భాగస్వామ్యంతో మొదటి మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో కెరీర్ లో తన 33వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కోహ్లి.

ఈ సెంచరీతో కెరీర్ లో 54వ సెంచరీలు పూర్తి చేసుకున్న కోహ్లికి సఫారీ గడ్డపై మాత్రం ఇదే తొలి సెంచరీ. కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్నింగ్స్ తో, ఏడేళ్ళ తర్వాత దక్షిణాఫ్రికా నేలపై తొలి విజయాన్ని టీమిండియా నమోదు చేసుకుంది. అలాగే సొంతగడ్డపై వరుసగా 17 విజయాలతో మాంచి దూకుడు మీదున్న సఫారీల రికార్డ్ కు బ్రేక్ వేసింది టీమిండియా. రెండవ వన్డే ఆదివారం నాడు డర్బన్ వేదికగా జరగనుంది.