Golden tweet of the Yearటీమిండియా టెస్ట్ కెప్టెన్ పగ్గాలు చేపట్టి, వరుస విజయాలను అందిస్తున్న విరాట్ కోహ్లి, ఒక్క క్రికెట్ లోనే కాదు, ట్విట్టర్ లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఇండియాకు గానూ ఈ ఏడాదిలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్లను ‘ట్విట్టర్‌’ విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ప్రభావవంతమైన ట్వీట్‌ గా అనుష్కను ఉద్దేశించి కోహ్లి చేసిన ట్వీట్‌ నిలిచి, ‘గోల్డన్‌ ట్వీట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ ఘనతను సొంతం చేసుకుంది.

విరాట్ కోహ్లీ పీకల్లోతు ప్రేమలో ఉండగా, టీ20 వరల్డ్ కప్ జరిగింది. అంతకు ముందు అత్యుత్తమ ఫాంలో ఉన్న కోహ్లీ పరుగుల వరద పారించాడు. దీంతో వరల్డ్ కప్ లో కోహ్లీ ప్రదర్శనపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ దశలో టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లు చూసేందుకు అనుష్క శర్మ మైదానానికి వచ్చేది. ఈ క్రమంలో కొన్ని మ్యాచ్ లలో ప్రతిభ చూపినప్పటికీ, చాలా మ్యాచ్ లలో వరుసగా విఫలం కావడంతో అభిమానులు భగ్గుమన్నారు.

అనుష్కను ఐరన్ లెగ్ గా పోలుస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ… కోహ్లీ వైఫల్యానికి అనుష్కే కారణమని నిందించారు. ఇది పతాక స్థాయికి చేరుకోవడంతో స్పందించిన కోహ్లీ, తన ట్విట్టర్ వాల్ పై ‘షేమ్’ అనే ఇమేజ్ ను ఉంచి, ‘నిరంతరం ఆమెను ఆడిపోసుకుంటున్న మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నా. కొంచెం కనికరం చూపండి. ఆమె ఎప్పుడూ నాకు సానుకూలతనే అందజేసింది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ ట్వీట్ రికార్డు స్థాయిలో 39 వేల సార్లు రీ ట్వీట్‌ కాగా, ఒక లక్షా ఏడు వేల మంది లైక్ చేశారు. ఈ క్రమంలో ఇది పెద్ద నోట్ల రద్దు కోసం ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ను కూడా బీట్ చేసేసింది. దీంతో ‘బెస్ట్ ట్వీట్ ఆఫ్ ది ఇయర్’గా రికార్డులకెక్కింది. కోహ్లి తరువాతి స్థానంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ట్వీట్ నిలిచింది. మూడో స్థానంలో 2016 టీ20 వరల్డ్‌ కప్‌ లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా హల్చల్ చేసిన ట్వీట్లు నిలిచాయి.