Virat-Kohliన్యూజిలాండ్ పర్యటనలో టీం ఇండియా ఇబ్బంది పడుతుంది. టీ20 సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్, ఆ తరువాత వన్ డే సిరీస్ పూర్తిగా పోగొట్టుకుంది. టెస్ట్ సిరీస్ లో కూడా మొదటి మ్యాచ్ ఓడిపోయి….ఇప్పుడు జరుగుతున్న రెండో మ్యాచ్ లో కూడా పేలవమైన ప్రదర్శన ఇస్తుంది. దీనికి టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

ఈ పర్యటన ఆసాంతం కోహ్లీ నిరాశపరిచాడు. 45, 11, 38, 11(టీ20లు) 51, 15, 9(వన్డేలు) 2,9..3, 14(టెస్టులు) ఈ పర్యటన మొత్తంలో కోహ్లీ చేసిన పరుగులివి. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు (14; 30 బంతుల్లో 3×4) మరోసారి నిరాశపర్చాడు. కివీస్‌ పర్యటన మొత్తంలో తొలివన్డేలో అర్ధ శతకం మినహా మిగతా ఏ మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు.

హామిల్టన్‌ వేదికగా జరిగిన వన్డేలో 51 పరుగులు చేసిన భారత సారథి తర్వాత ఏ మ్యాచ్‌లోనూ కనీసం 20 పరుగులు చేయలేకపోయాడు. కోహ్లీ కెరీర్‌లో ఫామ్‌ కోల్పోవడం ఇది మూడో సారి. 2011లో తొలిసారి ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు ఫామ్‌ కోల్పోయి సతమతమయ్యాడు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి నుంచి అక్టోబర్‌ వరకు ఇబ్బంది పడ్డాడు.

ఈ సందర్భంగా ఇంగ్లాండ్‌ పర్యటనలో పూర్తిగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. తర్వాత 2018 ఇంగ్లాండ్‌ పర్యటనలో చెలరేగి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మరోవైపు టీం ఇండియా మరో కీలక ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా కూడా సరైన ఫామ్ కనబరచకపోవడంతో టీంకు వరుస ఓటములు తప్పడం లేదు.