Virat Kohli first Indian after Sachin Tendulkar to become No .1ప్రపంచ క్రికెట్ ను తన బ్యాటింగ్ తో టీమిండియా సారధి విరాట్ కోహ్లి శాసిస్తున్నాడు. మైదానంలోకి అడుగుపెడితే, విరాట్ నుండి సెంచరీ తక్కువ కాకుండా ప్రేక్షకులు ఆశిస్తున్నారంటే, ఏ స్థాయిలో చెలరేగిపోతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. క్రికెట్ రికార్డుల దైవం అయిన సచిన్ జాబితాను రూపుమాపే బ్యాట్స్ మెన్ గా నీరాజనాలు అందుకుంటున్న విరాట్ కోహ్లి, తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.

ఇంగ్లాండ్ లో తొలి టెస్ట్ మ్యాచ్ లో ప్రదర్శించిన రెండు అద్భుతమైన ఇన్నింగ్స్ లకు గానూ అప్పటివరకు నెంబర్ 1 స్థానంలో ఉన్న స్టీవ్ స్మిత్ ను వెనక్కి నెట్టి, అగ్ర స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 2011 తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ నెంబర్ 1 కావడం ఇదే ప్రధమం. అప్పట్లో సచిన్ తన వీరవిహారమైన బ్యాటింగ్ తో నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించగా, ఇన్నాళ్ళకు విరాట్ కోహ్లి ఈ ఘనతను సాధించాడు.

ఇప్పటికే ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లి అగ్ర స్థానంలో ఉండగా, తాజాగా టెస్ట్ విభాగంలో కూడా ఆక్రమించడం గర్వించదగ్గ అంశం. అయితే ఇందులో నిరాశ చెందే విషయం ఏమిటంటే… కెప్టెన్ గా ఇప్పటివరకు 5 టెస్ట్ మ్యాచ్ సెంచరీలను సాధించిన కోహ్లి, ఈ అయిదింటిలోనూ టీమిండియా ఓటమి పాలు కావడం. ఇదే రికార్డును గతంలో విండీస్ దిగ్గజం బ్రెయిన్ లారా కలిగి ఉండగా, ఇపుడు దానిని కోహ్లి సమం చేసాడు.