virat kohli superp batting sixes fours161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్ మెన్లు ఆది నుండి ఆచితూచి ఆడడంతో సాధించాల్సిన రన్ రేట్ అంతకంతకూ పెరుగుతూ పోయింది. అలాగే ఒక ఎండ్ లో శిఖర్ ధావన్ (13), రోహిత్ శర్మ (12), రైనా (10), యువరాజ్ సింగ్ (21)లు నింపాదిగా బ్యాటింగ్ చేయడంతో ఒత్తిడికి గురైన విరాట్ కోహ్లి తనదైన అవకాశం కోసం వేచిచూసాడు. ముందుగా క్రీజులో పాతుకుపోవడానికి ప్రాధాన్యత ఇచ్చిన విరాట్ అర్ధ సెంచరీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా బౌలర్ల పని పట్టాడు.

సరిగ్గా 17 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ విజయానికి 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో విరాట్ కోహ్లి, ధోని ఉన్నప్పటికీ షాట్లు కనెక్ట్ కాకపోతుండడంతో క్రీడాభిమానులతో పాటు విశ్లేషకులు కూడా మ్యాచ్ ఫలితం ఆసీస్ కు అనుకూలంగా రావచ్చని భావించారు. అయితే 19వ ఓవర్ ముగిసే సమయానికి మ్యాచ్ ఫలితం దాదాపుగా తేలిపోయింది. అది కూడా భారత జట్టుకు అనుకూలంగా మారిపోయింది. ఈ రెండు ఓవర్లలో మొహలీ వేదికగా ఆసీస్ జట్టుకు తన బ్యాటింగ్ విధ్వంసం ఏంటో రుచి చూపించాడు విరాట్ కోహ్లి.

బంతి బ్యాట్ కు తగిలితే ఫోరా, సిక్సరా అనే విధంగా విరుచుకుపడ్డ కోహ్లి… ఫాల్కనర్ వేసిన 18వ ఓవర్ లో ఏకంగా 19 పరుగులు రాబట్టాడు. దీంతో 2 ఓవర్లలో 20 పరుగులు కావాల్సిన తరుణంలో కొల్టర్ నైల్ వేసిన 19వ ఓవర్లో కూడా 4 బౌండరీలు బాది మ్యాచ్ ను భారత్ వైపుకు మలిచాడు కోహ్లి. ఇక, ఎప్పటిలాగానే విన్నింగ్ షాట్ ను బౌండరీగా మలిచి తన బాధ్యతను ముగించాడు కెప్టెన్ ధోని.