virat-kohli-captain-of-indian-cricket-team-a-brandకష్టాల్లో ఉన్న భారత టెస్ట్ క్రికెట్ పగ్గాలను మహేంద్ర సింగ్ ధోని నుండి అందుకున్న అనంతరం వరుస విజయాలతో టీమిండియా రూపురేఖలను మార్చివేసి, భారత క్రికెట్ చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖిస్తున్నాడు విరాట్ కోహ్లి. బీసీసీఐ కెప్టెన్సీ పగ్గాలను విరాట్ కోహ్లికి అప్పచెప్పినపుడు… విరాట్ కు ఆవేశం ఎక్కువ… ఇలాంటి వ్యక్తికి టీమిండియా పగ్గాలు ఎందుకు ఇచ్చారన్న విమర్శల వ్యక్తమయ్యాయి. నిజమే… అప్పటివరకు ‘కూల్’ కెప్టెన్ ను చూసిన కళ్ళకు విరాట్ ‘ఉగ్రరూపం’ రుచించలేదు.

కానీ, తన విధానమే సరైనదంటూ వరుస విజయాలతో బదులు చెప్తూ… తన నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటున్నారు. వరుసగా అయిదవ టెస్ట్ మ్యాచ్ సిరీస్ విజయాన్ని సొంతం చేసుకోవడమంటే సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా సమర్ధుడైన నాయకుడు ఉంటేనే సాధ్యం. తాజాగా ఇంగ్లాండ్ తో 4-0, అంతకు ముందు న్యూజిలాండ్ తో 3-0, వెస్టీండీస్ తో 2-0, దక్షిణాఫ్రికాతో 3-0, శ్రీలంకతో 2-1 సిరీస్ లను అందుకుని టీమిండియాను నెంబర్ 1గా నిలిపాడు.

ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ అనే పేరు ఇండియాను పెను ప్రభావితం చేసింది. ఆ తర్వాత చాలా మంది ద్రావిడ్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్, యువరాజ్, మహేంద్ర సింగ్ ధోని వంటి క్రికెటర్లు ఇండియన్ క్రికెట్ లో తమ ముద్రను వేసుకున్నారు. కానీ, సచిన్ అంతటి ఖ్యాతిని మాత్రం ఒక్క విరాట్ కోహ్లికే దక్కుతోంది. సచిన్ బ్యాట్స్ మెన్ గా సక్సెస్ సాధించాడు గానీ, కెప్టెన్ గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. అలాగే ధోని కెప్టెన్ గా సక్సెస్ సాధించాడు గానీ, బ్యాట్స్ మెన్ గా తొలినాళ్ళల్లో ఉన్న దూకుడు లోపించింది. ‘బ్యాటింగ్ + కెప్టెన్సీ” ఈ రెండింటిని సమర్ధవంతంగా నిర్వహించగల ఇండియన్ క్రికెటర్ ఒక్క విరాట్ కోహ్లినే అనేటంతగా సరికొత్త చరిత్రకు కారణమవుతున్నాడు.