Virat kohli breaks sachin tendulkar recordsఒక్క ఇండియన్ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లోనే బ్యాటింగ్ విభాగంలో అత్యధిక రికార్డులు ‘మాస్టర్ బ్లాస్టర్’ సొంతం. అయితే సచిన్ పేరుతో లిఖించబడ్డ రికార్డులను తుడిచిపెట్టే పనిలో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఉన్నాడు. తాజాగా వెస్టీండీస్ తో జరిగిన చివరి వన్డే మ్యాచ్ లో సెంచరీ సాధించి, టీమిండియాకు సిరీస్ ను అందించిన విరాట్, ఓ అరుదైన రికార్డును తన వశం చేసుకున్నాడు. దీంతో పాటు ‘చేజింగ్ స్టార్’ అన్న బిరుదును కూడా సార్ధకం చేసుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి, 205 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో షమీ 4, ఉమేష్ యాదవ్ 3 వికెట్లను సొంతం చేసుకోగా, పాండ్య, కేదార్ జాదవ్ చెరో వికెట్ ను దక్కించుకున్నారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మొదటి ఓవర్లోనే ధావన్ వికెట్ ను కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి, విండీస్ కు మరో అవకాశం ఇవ్వకుండా, అజేయమైన సెంచరీ (115 బంతుల్లో 111 పరుగుల)తో మ్యాచ్ ను పూర్తిగా టీమిండియా వైపుకు తిప్పాడు.

మరో ఓపెనర్ రెహానే 39 పరుగులు చేసి అవుట్ కాగా, తదుపరి క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తీక్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్ ను ముగించాడు. విరాట్ కోహ్లి తన వన్డే కెరీర్ లో 28వ సెంచరీని నమోదు చేయగా, చేజింగ్ లో 18 సెంచరీగా రికార్డైంది. ఇప్పటివరకు చేజింగ్స్ లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ దే అత్యధిక రికార్డు. 232 ఇన్నింగ్స్ లు ఆడిన సచిన్ 17 సెంచరీలు నమోదు చేయగా, ఈ రికార్డును కేవలం 102 ఇన్నింగ్స్ లలో 18 సెంచరీలు సాధించి తుడిచి పెట్టేసాడు కోహ్లి.

మరో విశేషం ఏమిటంటే… సచిన్ ఓపెనర్ గా అత్యధిక మ్యాచ్ లు ఆడగా, కోహ్లి మిడిల్ ఆర్డర్ లో ఆడుతూనే ఈ రికార్డును అందుకోవడం. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లి సొంతం కాగా, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అజెంకా రెహానే దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లో మొత్తం 336 పరుగులు చేసిన రెహానే, అయిదు మ్యాచ్ ల సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ క్రికెటర్ గా రెండవ స్థానంలో నిలిచాడు. 2015-16 సీజన్ లో రోహిత్ శర్మ 441 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.