Virat Kohli asks cricket fan to leave Indiaటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడైన ఆటతీరుతో పాటు దుందుడుకు ప్రవర్తనకు మారు పేరు. ఈ నెల 5న తన పుట్టినరోజు సందర్భంగా కోహ్లీ తన పేరుతో ఓ యాప్ ను ప్రారంభించగా, అందులో ఓ క్రికెట్ ప్రేమికుడు కోహ్లీకి వ్యతిరేకంగా కామెంట్ పెట్టాడు. దీనికి కౌంటర్ గా కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ లో తీవ్ర దుమారం లేపుతున్నాయి.

ఇందులో కోహ్లి బలికావడం అసలు ట్విస్ట్. అభిమానులతో టచ్ లో ఉండేందుకు ‘కోహ్లీ యాప్’ను ప్రారంభించగా, “కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్‌ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రీడాకారుల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం” అని కామెంట్ పెట్టాడు. దీంతో సహనం కోల్పోయిన కోహ్లీ…

‘నువ్వు భారత్‌లో ఉండాల్సిన వాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ విదేశాలపై నీకు ప్రేమ ఉంది. నీవు నన్ను అభిమానించ మాత్రాన నాకేం నష్టం లేదు. కానీ, నీకు ఈ దేశం సరైంది కాదు’ అని తీవ్రంగా జవాబిచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

విదేశీ వస్తువులను వాడుతూ, విదేశాల్లో (ఇటలీ) పెళ్లి చేసుకుని, విదేశీ బ్రాండ్ల ప్రకటనల్లో నటిస్తూ స్వదేశం గురించి కోహ్లీ చెప్పడం ఏంటని పలువురు మండిపడుతున్నారు. విదేశీ క్రికెటర్లను ఇష్టపడినంత మాత్రాన దేశం విడిచి వెళ్లిపోవాలా? అని ప్రశ్నిస్తున్నారు. అభిమానుల పాయింట్ లోనూ లాజిక్ ఉంది కదా కోహ్లి… కాస్త కూల్ గా ఆలోచించు…!