Viral-Video-Girl-harrased-for-educationవిద్య అంటే ఒకప్పుడు విజ్ఞానంగా భావించేవారు. కానీ ప్రస్తుతం చిన్నారుల పాలిట శాపంలా మారుతోంది. స్కూల్స్ లో ర్యాంకుల కోసం ఓ పక్కన విద్యా సంస్థలు ఉదయం నుండి సాయంత్రం వరకు యంత్రంలా రుబ్బుతుంటే, ఆ తర్వాత ఇంటికి వచ్చిన పిల్లలకు పేరెంట్స్ నుండి అదే తరహా రుద్దుడు ఎదురువుతున్న వైనం చూస్తూనే ఉంటాం. అయితే కొందరు మాత్రం ఈ హద్దులు దాటి పిల్లలను నరకయాతన పెడుతూ తమ పైత్యాన్నంతా ప్రదర్శిస్తుంటారు. అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.

ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ అన్న తారతమ్యాలు లేకుండా ఈ చిన్నారికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అంకెలు 1, 2, 3, 4, 5లను నేర్పించే తీరుతో ఉన్న ఈ వీడియోలో చిన్నారి, అంకె పలకాలంటే వణికిపోతున్న వైనం, మానవత్వం ఉన్న సగటు మనిషి హృదయాన్ని కదిలించి వేస్తోంది. చదువు పేరుతో ఆ పిల్లాడిని ఓ మానసిక రోగిగా మార్చే ప్రక్రియే కనపడుతోంది తప్ప, నిజంగా చదువు చెప్పే తీరు కనపడడం లేదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!

ఈ వీడియోపై ప్రముఖ సెలబ్రిటీలు కూడా తమ భావాలను పంచుకుంటూ షేర్ చేయడం విశేషం. ఆ పిల్లాడి పేరెంట్స్ కు కనీసం కౌన్సిలింగ్ అయినా ఇప్పించండి అంటూ అల్లు శిరీష్ ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. ఈ వీడియోలో వన్, టు, త్రీ, ఫోర్, ఫైవ్ చెప్పడానికి భయంతో కన్ఫ్యూజ్ అయిన చిన్నారి చెంపపై కొట్టేపాటికి, ఎంత కసిగా చెప్పాడో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఈ వీడియో చూసిన వారికి మాత్రం అదే కసి, అదే దెబ్బ ఆ పిల్లాడికి చదువు చెప్తున్న వ్యక్తిపై పడాలి అంటూ తమ భావాలను పంచుకుంటున్నారు.