elephant-saves-manమనసును హత్తుకునే వీడియోలు చాలా అరుదుగా కనపడుతుంటాయి. అలాంటి అరుదైన వీడియోలలో ఇది కూడా ఒకటి. తన మావటి నీటిలో పడి కొట్టుకుపోతున్నాడని భావించిన ఓ ఏనుగు పిల్ల అతన్ని కాపాడేందుకు నీటిలోకి దూకింది. వేగంగా అతన్ని చేరి తొండం ఆసరాగా ఇచ్చింది. ఆపై కొట్టుకుపోకుండా చూడాలన్న ఉద్దేశంతో కాలు అడ్డు పెట్టింది. ఈ మొత్తం ఘటనంతా థాయ్ ల్యాండ్ లోని ఎలిఫెంట్ నేచర్ పార్క్ లో జరిగింది. పార్కులోని అతి చిన్నదైన ఈ ఏనుగు పేరు ఖామ్ లా.

ఈ మొత్తం దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఐదు రోజుల్లోనే ఈ వీడియోను 36 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తి ఆ ఏనుగుల మావటే. అతని పేరు డార్రిక్. వాస్తవానికి అతను నదిలో ఈదుతున్నాడు. అతనికేదో ప్రమాదం సంభవించిందని భావించిన ఖామ్ లా ఇలా రక్షించడానికి ముందుకు దూకింది. జంతువుల పట్ల ప్రేమను చూపితే, అవి కూడా అంతే అనుబంధాన్ని పెంచుకుంటాయని తేటతెల్లం చేస్తున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..!