violence-in-andhra-jaganమొన్న తుని, నిన్న అనంతపురం… రేపు మరెక్కడో..? ఇలా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కో జిల్లాలో ఒక్కో కారణంతో చెలరేగుతున్న అల్లర్లు, దాడులు, ప్రతిదాడులు, లాఠీఛార్జీలతో… ‘అసలు ఈ నగరాలకు ఏమైంది’ అనే ఆలోచనలకు ప్రజలు వస్తున్నారు. తాజాగా జగన్ తన ప్రతిపక్ష నేత స్థాయిని సైతం మరచి, సినిమాలలో డైలాగ్ ల మాదిరి ముఖ్యమంత్రి స్థాయి పదవిని కూడా గౌరవించకుండా చంద్రబాబు నాయుడు పై చేసిన విమర్శలకు అనంతపురంలో చెలరేగిన విధ్వంసానికి జగన్ కారణమయ్యాడు.

‘చెప్పు చేతికి వస్తే ఎంతటి అల్లర్లు చెలరేగుతాయో…’ తాజాగా జరిగిన ఘటనల వల్ల ప్రజలకే కాదు రాజకీయ నాయకులకు సైతం అవగతం అయ్యిందని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. తుని ఘటన సందర్భంలో అధికార పార్టీ వర్గం జగన్ పై చేసిన విమర్శలను అనంతపురంలో జరిగిన అల్లర్లు బలపరిచినట్లయ్యింది. ప్రజల ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి… ప్రజలను విమర్శించినట్లుగానే భావించాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలుగా భావించాల్సి వస్తోంది.

ఈ అల్లర్లను చూసి ప్రజలను, పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం నాయకులను కూడా సంయమనం పాటించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. కానీ, ఈ విధ్వంసం చూసి కూడా కనీస భాధ్యతగా తన కార్యకర్తలకు ఒక్క సూచన సైతం చేయకపోగా, రోజురోజుకి వారిని మరింతగా రెచ్చగొట్టే వ్యాఖలు చేయడం అత్యంత శోచనీయమైన అంశం. ఒక ప్రతిపక్ష నేతగా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని ఎంతవరకు జగన్ నిలబెట్టుకుంటున్నారో, సదరు యువనేతే సమాలోచనలు చేసుకోవాలి.

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం… “జగన్ రాజకీయ జీవితానికి చరమగీతం పాడాల్సిందే… లేదంటే రాష్ట్రానికి తప్పదు భారీ మూల్యం…” అంటూ ముఖ్యమంత్రికి విన్నపాలు చేస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదని చంద్రబాబుపై కక్ష్య! లేదా ఆ పదవికి తనను ఎన్నుకోలేదని ప్రజలపై అక్కసా? “జగన్ పై ఈ నిర్లక్య వైఖరి ఇంకెన్నాళ్ళు బాబు గారు…” అంటూ ఆనం వివేకానందరెడ్డి మీడియా సాక్షిగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారు.

రాజకీయాలలో విమర్శలు సహజమే కాని అవి వ్యక్తిగత విమర్శలు కాకూడదు ఆ విషయం అన్ని పార్టీ రాజకీయ నాయకులు గుర్తుంచుకొని రాజకీయాలు చేస్తే వారిపై ప్రజలకు కూడా గౌరవం పెరుగుతుంది. అలా కాకుండా తన ‘ఉనికి’ నిలుపుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టే విమర్శలు చేసి వారిని ప్రభావితం చేయడం వల్ల ప్రస్తుతానికి కొంత ప్రయోజనం చేకూరినప్పటికీ, భవిష్యత్తులో తప్పదు భారీ మూల్యం..!