Dasara Village Nativity Movies కమర్షియల్ సినిమా ఎప్పుడూ ఊహాతీతంగా నిజ జీవితంలో జరిగే అవకాశం లేనట్టే ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు ఊహలకే పరిమితమైన హీరోయిజాన్ని తెరమీద చూసుకుని సంతృప్తి పడతారు. అది ఎంత బాగా చూపిస్తారనే దాన్ని బట్టి కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. నీళ్లు తోడి తోడి బావి వట్టిపోయినట్టు టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి కథల కొరత వచ్చింది. జనాన్ని థియేటర్లకు రప్పించాలంటే రొటీన్ స్టోరీలతో పని జరగదు. మెకానికల్ గా మారిపోయిన లైఫ్ లో సహజత్వం మిస్ అవుతోంది. సెలవు వస్తే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడానికే సరిపోతున్న సగటు జీవితాల్లో పల్లెటూరి ఊసులు లేకుండా పోయాయి. ఇప్పటి తరం అమ్మమ్మ తాతయ్య ఊళ్లను కూడా మారిపోతోంది.

ఈ గ్యాప్ ని యంగ్ జనరేషన్ దర్శకులు సరిగ్గా ఒడిసి పట్టుకున్నారు. జానర్ ఏదైనా సరే ఆడియన్స్ ని టైం మెషీన్ లో వెనక్కు తీసుకెళ్తున్నారు. సెల్ ఫోన్లు ఇంటర్ నెట్లు లేని కాలంలో పరిస్థితులు కష్టాలు కోపాలు కన్నీళ్లు ఎలా ఉండేవో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. వీర్నపల్లె ఊరిలో సిల్క్ బారు దగ్గర జనం మందలుగా కల్లు తాగే సన్నివేశాన్ని చిన్నప్పుడు ప్రత్యక్షంగా చూసిన శ్రీకాంత్ ఓదెల దాన్ని మాస్ మసాలా ఫార్మట్ లో దసరాగా తీస్తే నాని కెరీర్ లోనే అతి పెద్ద నెంబర్లను నమోదు చేస్తోంది. కమెడియన్ వేణు యెల్దండి తెలంగాణ సాంప్రదాయాల్లో ఆత్మను పట్టుకుని బలగం తీస్తే అదేమో దిల్ రాజుకి కామధేనువుగా మారింది.

రంగస్థలంలో సుకుమార్ తీసుకున్న నేపథ్యం, గతంలో ఫిదాతో శేఖర్ కమ్ముల నైజామ్ అమ్మాయిల మనస్తత్వాన్ని భానుమతి పాత్ర ద్వారా చూపించిన విధానం ఆయా సినిమాలకు అదిరిపోయే విజయాలను అందించాయి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షన్ ని కేవలం కాసులు కురిపించే ఫార్ములాగా చూసి సంవత్సరాల తరబడి వాడేశారు. సీనియర్ దర్శకులు వంశీ దాదాపు తన ప్రతి సినిమాల గోదావరి ఒడ్డున ఉండే ఊళ్ళలో సోయగాలను, అక్కడి జనాల మనస్తత్వాలను ఆధారంగా చేసుకుని ఆణిముత్యాల్లాంటి హాస్య చిత్రాలు ఇచ్చారు. అవి క్లాసిక్స్ గా నిలిచిపోయాయి. పుష్పలో పరిచయం చేసిన చిత్తూరు స్లాంగ్ ఎందరిని ప్రేరేపించిందో లెక్క వేయడం కష్టం.

రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ ఇంకా ఉదృతమవుతుంది. కొత్త నేపధ్యాలను వెతకడం ప్రారంభమవుతుంది. ఊళ్లు వాటి చరిత్రలు అక్కడి భాషలు యాసలు మనుషుల అలవాట్లు వీటి మీద వచ్చిన పుస్తకాలు అన్నిటి మీద రీసెర్చ్ చేస్తారు. విదేశీ సినిమాల నుంచి స్ఫూర్తి చెందడం కన్నా పెద్దోళ్ల జ్ఞాపకాల్లో మిగిలిపోయిన పాత బంగారాన్ని తవ్వుకుంటూ పోతే ఇంకా ఎన్నో అద్భుతాలు చేయొచ్చు. అయితే నేటివిటీని వాడుకునే పదే పదే అవే కథలను మార్చి చూపించినా ప్రమాదమే. ఆడియన్స్ మరీ అంత అమాయకంగా ఉండరు. రిపీట్ రొటీన్ అనిపించేది ఏదైనా సరే నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు. కాబట్టి క్రియేటివిటీ జోడించనిదే ఈ ట్రెండ్ ఎక్కువ కాలం నిలవదు.