vikramarkudu-2-rajamouli-ravi-teja-rumours2006లో మాస్ మహారాజా రవితేజకు “విక్రమార్కుడు” వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ఘనత రాజమౌళి సొంతం. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రానుందన్న సమాచారాన్ని గతంలో రాజమౌళినే చెప్పినప్పటికీ, అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చుకోలేదు. రవితేజ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా నిలిచిన ఈ సినిమా సీక్వెల్ పై మాస్ మాహారాజా అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు.

అయితే ఈ అంచనాలు నిజమయ్యే కార్యక్రమం త్వరలోనే జరగనుంది. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ “విక్రమార్కుడు” సినిమాకు సీక్వెల్ కధను అందించే పనిలో నిమగ్నమయ్యారు. అన్నీ కుదిరితే ఈ సినిమాలో హీరో కూడా రవితేజనే. ఈ విషయాన్ని గతంలోనే రాజమౌళి స్పష్టం చేసినప్పటికీ, ప్రస్తుతం రవితేజ సినిమాలు చేయకుండా ప్రపంచాన్ని చూస్తూ ఆనందిస్తున్న నేపధ్యంలో… మళ్ళీ సినిమాలు చేస్తాడా లేదా అన్నది ట్రేడ్ వర్గాలకే అంతు పట్టడం లేదు.

అయితే రాజమౌళి సినిమాను కాదనే సాహాసం గానీ, అవివేకమైన నిర్ణయం గానీ రవితేజ చేయకపోవచ్చు గనుక… “అత్తిలి సత్తిబాబు” ఈజ్ బ్యాక్… అంటున్నారు సినీ జనాలు. ఇదే కార్యరూపం దాలిస్తే… బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మోతమోగాల్సిందే అంటున్నారు మాస్ మహారాజా ఫ్యాన్స్. ‘విక్రమార్కుడు’ సీక్వెల్ సంగతులు ఇలా ఉంటే, శంకర్ దర్శకత్వం వహించిన “ఒకే ఒక్కడు” సినిమాకు కూడా సీక్వెల్ సిద్ధమవుతోంది.

‘ఒకే ఒక్కడు’ సినిమాను హిందీలో ‘నాయక్’గా రీమేక్ చేసిన నేపధ్యంలో… ఈ ‘నాయక్’ సినిమాకే సీక్వెల్ ను అందించే క్రమంలో విజయేంద్రప్రసాద్ కలం సిద్ధమైంది. ఈ రెండు సినిమాలకు సంబంధించిన సంగతులు సోషల్ మీడియాలో హాట్ హాట్ గా హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం ‘బాహుబలి’ షూటింగ్ తుదిదశకు చేరుకోవడంతో రచయితగా విజయేంద్రప్రసాద్ ఫ్రీ అవ్వడంతో… తదుపరి సినిమాలపై దృష్టి సారించే క్రమంలో ఈ సీక్వెల్స్ పుట్టుకొస్తున్నాయి.