Vijaysai Reddyరాజకీయ పార్టీలు, వాటి నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో చాలా విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. తర్వాత వాటిని మరిచిపోతుంటారు… అధికారంలోకి వచ్చాక అవే వారి పీకలకి చుట్టుకొంటాయి. ఇందుకు తాజా ఉదాహరణంగా నాడు, నేడు వైసీపీ ఎంపీగా ఉన్న విజయసాయి రెడ్డి కియా కార్ల కంపెనీ గురించి చేసిన పూర్తి భిన్నమైన ఈ ట్వీట్స్ కనిపిస్తాయి.

ఆనాడు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పట్టుబట్టి దక్షిణ కొరియాకి చెందిన కియా మోటార్స్ (ఎలెక్ట్రిక్ కార్ల కంపెనీ)ని ఏపీకి రప్పించి అనంతపురంలో ప్లాంట్‌ని ఏర్పాటు చేయించారు. అప్పుడు విజయసాయి రెడ్డి “కార్లు అమ్ముడుపోని కారణంగా కియా మోటార్స్ చైనాలోని అతిపెద్ద ప్లాంటుని మూసివేసింది. మరి అనంతపురంలో ఏర్పాటవుతున్న ప్లాంట్‌ని సంగతో? కమీషన్ల కక్కుర్తితో కియా మోటార్స్‌కు చంద్రబాబు నాయుడు 2,000 కోట్ల రాయితీలు ఇచ్చాడు. కంపెనీ ఉద్యోగులలో స్థానికులు వందమంది మించి లేరు,” అని ట్వీట్ చేశారు.

Vijay Sai Reddy

ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి “మేడిన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా అనంతపురంలోని తయారైన ‘కియా కారెన్స్’ 2023 సంవత్సరానికి అత్యుత్తమైన కారు (కార్ ఆఫ్ ద ఇయర్) అవార్డు అందుకొన్నందుకు ఎంతో గర్వంగా ఉంది. అనంతపురం కియా ప్లాంటులో 2019లో 57,719 కాట్లు ఉత్పత్తి కాగా 2021లో వాటి సంఖ్య 2.27 లక్షలకి చేరుకోవడం మాకు ఎంతో గర్వంగా ఉంది. ఏపీలో తయారైన కియా కార్లు ప్రపంచదేశాలకి ఎగుమతి అవుతుండటం మాకు చాలా గర్వకారణం,” అని ట్వీట్ చేశారు.

ఆనాడు చంద్రబాబు నాయుడు భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ కార్లు డిమాండ్‌ ఏర్పడుతుందని ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రానికి కియా మోటా ర్స్‌ని తీసుకువస్తే, దివాళా తీసిన ప్లాంటుని కమీషన్ల కోసం కక్కుర్తిపడి తెచ్చారని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు అదే విజయసాయి రెడ్డి కియా కార్ల కంపెనీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రారంభం అయ్యిందన్నట్లు, అది కార్లు తయారుచేయడం, అవార్డు రావడం, ఎగుమతులు చేస్తుండటం అన్ని తమ ప్రభుత్వం ఘనతే అన్నట్లు చెప్పుకొంటున్నారు! అనాడూ పనికిరాదన్న కియా కంపెనీయే నేడు ఏపీకి గర్వకారణమట!

నిజానికి ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే కియా కంపెనీ కూడా మూసుకొని వెళ్లిపోయేందుకు సిద్దపడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ వైసీపీ నేతల షరతులకి అంగీకరించడంతో ఇంకా ఏపీలో కొనసాగుతోంది.