Vijaysai-Reddy-Sarath-Chandra-Delhi-Liquor-Scam-ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు తెలుగు రాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులు పెన్నాక శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబులను ఢిల్లీలో అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. వారిలో శరత్ చంద్రా రెడ్డి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడని అందరికీ తెలిసిందే.

ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాతో బేరసారాలు చేసుకొని మద్యం పాలసీని రూపొందించడానికి జరిగిన కుంభకోణంలో వీరిరువురి పాత్ర కూడా ఉందని భావించి అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. శరత్ చంద్రారెడ్డికి అరబిందో గ్రూపులోని 12 కంపెనీలలో, అలాగే ట్రైడెంట్ లైఫ్ సైన్సస్ అనే మరో కంపెనీలో డైరెక్టరుగా ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు.

శరత్ చంద్రారెడ్డిని సెప్టెంబర్‌ 21, 22, 23 తేదీలలో ప్రశ్నించి ఈ కుంభకోణం ఈఎండీ (డిపాజిట్) చెల్లించినట్లు గుర్తించామని తెలిపారు. మళ్ళీ గత మూడు రోజులుగా మరోసారి ప్రశ్నించగా ఆయన తమకు సహకరించనందున అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈరోజు ఆయనను ఈడీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఇంతకు ముందు హైదరాబాద్‌కి చెందిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకి సంబంధాలు ఉన్నట్లు మొదట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్‌లో టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె వాటిని ఖండించారు. ఇప్పుడు వైసీపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్:2 స్థానంలో ఉంటూ పార్టీలోను, ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్న ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు పెన్నాక శరత్ చంద్రారెడ్డి అవడం ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి. రేపు ప్రధాని నరేంద్రమోడీ విశాఖనగరానికి పర్యటనకు వస్తుండటంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికి 12వ తేదీన జరుగబోయే బహిరంగసభను విజయవంతం చేసే బాధ్యతను పూర్తిగా విజయసాయి రెడ్డి తన భుజాలపై వేసుకొని చేస్తుండగా, అక్కడ ఢిల్లీలో ఆయన అల్లుడు అరెస్ట్ కావడం పెద్ద షాక్ అనే చెప్పవచ్చు. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.