VijaySai-Reddy-Ramoji-Raoవైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి దసపల్లా భూముల వ్యవహారంలో ఈనాడు మీడియా తనపై చేసిన ఆరోపణలపై ధీటుగా స్పందించారు. అవి ప్రభుత్వ భూములు కావు. కానీ గతంలో ఎవరో ప్రభుత్వ భూములని సుప్రీంకోర్టుకి వెళితే చంద్రబాబు నాయుడు వాటిని అడ్డుకోకపోవడం వలననే ఈ సమస్య తలెత్తింది.

నేటికీ కోర్టు ధిక్కారణ నేరం క్రింద అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అక్కడ ఎప్పుడో ఇళ్ళు కట్టుకొని స్థిరపడిన సుమారు 400 కుటుంబాలవారు, చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికే చెందిన 55 మందితో సహా మరో ఐదుగురు ప్లాట్ ఓనర్లు ఈ న్యాయవివాదం కారణంగా చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. కనుక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మేము ఈ సమస్యను పరిష్కరించాము.

అయితే విశాఖకు రాజధాని రాకూడదని, ఉత్తరాంద్ర బాగుపడకూడదని పంతం పట్టిన ఈనాడు, కొన్ని కుల పిచ్చి పత్రికలు ఇలాంటి పిచ్చి రాతలు రాస్తూ మాపై బురదజల్లుతున్నాయి. ఈ సందర్భంగా నేను ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుకు ఓ సవాల్ విసురుతున్నాను. మీ మార్గదర్శి సంస్థ ఫిక్స్ డిపాజిట్ల రూపంలో ప్రజల నుంచి ఎంత సొమ్మును వసూలు చేసింది?ఎంతమందిని ముంచేసిందో లెక్కలు తేల్చేందుకు సీబీఐ లేదా ఈడీ దర్యాప్తుకి వెళ్ళగలరా?

నేను కూడా దసపల్లా భూముల వ్యవహారంలో సీబీఐ, ఈడీ, కావాలంటే ఎఫ్‌బీఐ.. ఏ విచారనాకైనా సిద్దం. విచారణలో ఎవరు నేరం చేశారో… ఎవరు జైలుకి వెళతారో తేలిపోతుంది. నా సవాలుని స్వీకరించే దమ్ముందా రామూ నీకు? అని అడుగుతున్నా.

విశాఖను రాజధానిగా చేయకుండా అడ్డుపడేందుకు ఈనాడును అడ్డంపెట్టుకొని నువ్వు రాస్తున్న పిచ్చిరాతలన్నీ నేను గమనిస్తున్నా. అందుకే ఇప్పుడే నేను కూడా ఓ నిర్ణయానికి వచ్చాను. త్వరలోనే నేను కూడా ఓ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసి దాంతో నీకు తగిన జవాబు చెప్తాను. నేనే నీ రంగంలో ప్రవేశిస్తున్నాను. కాస్కో రామూ…” అంటూ విజయసాయి రెడ్డి రామోజీరావుకి సవాల్ విసిరారు.