vijaydevarakonda thumsup adఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి… ప్రస్తుతం ఇండస్ట్రీలోని సింహాభాగం వీరి వారసులే. వారసత్వంతో వచ్చినా, కష్టపడడంలో మాత్రం ఏ హీరోను కూడా తక్కువగా చూడలేం. ఆ కష్టమే ఏ సినిమా రికార్డులను కొల్లగొట్టాలన్నా, తెలుగు సినీ మార్కెట్ ను దశదిశలా విస్తరింపజేయాలన్నా ఈ వారసుల వలనే సాధ్యమవుతోంది. అలాగే తమ ప్రచార అస్త్రాలుగా ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ‘బ్రాండ్ అంబాసిడర్’లుగా వీరి మధ్యనే వెతుకుతుంటారు.

కానీ వీరందరిని కాదని ఓ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగుతోంది, కార్పొరేట్ కంపెనీలు కూడా ఆ యంగ్ హీరో వైపుకు చూస్తున్నాయి. అతను మరెవరో కాదు, అభిమానులంతా ముద్దుగా ‘రౌడీ’గా పిలుచుకునే విజయ్ దేవరకొండ. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి సినిమాలో సైడ్ క్యారెక్టర్ రోల్ చేసిన విజయ్, ఈ రోజు ఈ స్థాయికి ఎదుగుతారని బహుశా తను కూడా ఊహించి ఉండకపోవచ్చు.

‘అర్జున్ రెడ్డి’తో ఒక ప్రభంజనం సృష్టించిన విజయ్ కు దక్కిన విజయం ఏదో ఫ్లూక్ గా తగిలిందిలే అనుకున్నారు. ఈ మాటను స్వయంగా మెగాస్టార్ చిరంజీవే ఓ బహిరంగ వేదిక మీద వెల్లడించారు. తప్పు లేదు… నాటి పరిస్థితి అలాగే ఉంది. అలాగే ‘గీత గోవిందం’ వంటి ఓ సాధారణ సినిమాతో ఏకంగా స్టార్ హీరోలు వసూలు చేసే కలెక్షన్స్ ను రాబట్టాడు.

దీంతో విజయ్ దేవరకొండ అనే పేరు ఏదో ఫ్లూక్ గా వచ్చింది కాదు, అది ఒక సెన్సేషన్ అన్న విషయం టాలీవుడ్ కు అర్ధమైంది. ఆ తర్వాత పరాజయాలు పలకరించినా, స్టార్ హీరోల మాదిరి విజయ్ క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. అది ఎంతవరకు వెళ్లిందంటే, ఏకంగా తన సినిమాను దేశ వ్యాప్తంగా విడుదల చేసేటంత సాహాసాన్ని దర్శక నిర్మాతలు చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు.

పైన పేర్కొన్న స్టార్ హీరోల వారసులలో ఇప్పటివరకు ఒక్క ప్రభాస్ మాత్రమే దేశవ్యాప్తంగా మార్కెట్ ను అందుకోగలిగారు. ‘పుష్ప’ ద్వారా అల్లు అర్జున్ విజయం సాధించారు గానీ, ఒక్క సినిమా సక్సెస్ కొలమానంగా పరిగణించలేం. ‘ఆర్ఆర్ఆర్’ రూపంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మహేష్ పాన్ ఇండియా మూవీ చేయడానికి దాదాపుగా మరో రెండేళ్ల సమయం ఉంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ రీత్యా ఈ దిశగా అడుగులు వేయకపోవచ్చు.

ఇలా స్టార్ హీరోలే పాన్ ఇండియా మూవీపై అటుఇటుగా ఊగిసలాడుతుంటే, “లైగర్”తో ఆగష్టు 25వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల సిద్ధమవుతున్నాడు విజయ్. ఈ ఒక్క సినిమాతోనే విజయ్ ను కూడా నేషనల్ స్టార్ గా పరిగణించలేం గానీ, విజయ్ దేవరకొండ వేస్తోన్న అడుగులు మాత్రం టాలీవుడ్ తదుపరి “సూపర్ స్టార్” కాబోతున్నాడన్న సంకేతాలను వ్యక్తపరుస్తున్నాయి.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో చేసే థమ్సప్ యాడ్ ఇప్పుడు విజయ్ వశమైంది. ఇదేమీ తక్కువ విషయం కాదు. మార్కెట్ లో కొన్ని బ్రాండ్స్ కు ఎంపిక అయ్యే హీరోల ఆధారంగా కూడా వారి స్టార్ స్టేటస్ తెలుస్తుంది. తెలుగులో అంతకుముందు చిరంజీవి, ఆ తర్వాత మహేష్ బాబులు చేసిన యాడ్ ను ఇప్పుడు విజయ్ దేవరకొండ చేయడం సామాన్యమైన విషయమేమి కాదు.

ఈ థమ్సప్ యాడ్ విజయ్ స్టేటస్ కు ఓ సిగ్నల్ గా కనపడుతోంది గానీ, భవిష్యత్తులో టాలీవుడ్ మేటి సూపర్ స్టార్ గా విజయ్ ఎదుగుతాడన్న సంకేతాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి, స్టార్ స్టేటస్ బలం ఉండి కూడా సక్సెస్ కోసం పడిగాపులు పడుతున్న తరుణంలో… స్టార్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఓ స్టార్ హీరోగా విజయ్ ఎదగడం అనేది టాలీవుడ్ కు శుభపరిణామం.