Vijayawada Politics Lagadapati Raj gopalకాంగ్రెస్ పార్టీ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన విషయం తెలిసిందే. సచివాలయంలోని చంద్రబాబు కార్యాలయంలో వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై లగడపాటి ప్రశంసలు కురిపించారు. తాత్కాలిక సచివాలయమే ఇంత అద్భుతంగా ఉంటే… శాశ్వత భవనాలు ఇంకెంత అద్బుతంగా ఉంటాయో అంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు చంద్రబాబుతో లగడపాటి భేటీ కావడం, విజయవాడ రాజకీయాల్లో వేడిని పెంచింది. ఓ వైపు కేశినేని నాని వ్యవహారశైలిపై చంద్రబాబు అసహనంగా ఉన్న సమయంలో ఆయనను లగడపాటి కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ భవిష్యత్తు కోసం కేశినేని ట్రావెల్స్ ను కూడా నాని మూసి వేశారు. ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పట్ల కేశినేని నాని ప్రవర్తించిన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు… ఆయనను దూరం పెట్టే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో కేశినేని నానిని పక్కన పెట్టి, ఈ విజయవాడ మాజీ ఎంపీ లగడపాటికి చంద్రబాబు మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తారా? అనే కోణంలో స్థానికంగా చర్చ జరుగుతోంది. బొండా ఉమా ‘జనసేన’ జెండా పట్టుకుంటారన్న టాక్ ఉండడంతో, ఆయనతో పాటుగా ఎంపీ కేశినేని నాని కూడా దూకుతారా? అన్న కోణంలో విశ్లేషకుల భావాలు వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాలతో రాజకీయాలలోనూ ‘సమ్మర్’ సెగ తగులుతోంది. రాబోతున్న రోజుల్లో అధికార తెలుగుదేశం పార్టీలో ఏం జరగబోతుంది? అన్న ఉత్కంఠ నెలకొంది.