vijayawada kanakadurga temple flyover worksకనకదుర్గమ్మ గుడి వద్ద ఫ్లై ఓవర్ అనేది బెజవాడ వాసుల ‘కల.’ ఇటీవల ఈ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కావడంతో నగర వాసులు హర్షం వ్యక్తం చేసారు. ఈ క్రమంలోనే గత రెండు దశాబ్దాలుగా నలుగుతున్న మరో అంశానికి చంద్రబాబు ‘శుభం కార్డు’ వేయబోతున్నారు. విజయవాడకు తలమానీకం అయినటువంటి కృష్ణానదికి వరద ప్రవాహం వచ్చినప్పుడల్లా, నదీ తీర ప్రాంతంలో నివసించే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతుంటారు. కృష్ణలంక ప్రాంతం మొదలుకొని అవనిగడ్డ వరకు ఈ ప్రభావం కనపడుతుంది. అయితే యనమలకుదురు నుండి అవనిగడ్డ వరకు కరకట్టను పటిష్టం చేయడంతో, ఈ ప్రాంతాలలో వరద నీటిని నియత్రించగలుగుతున్నారు.

కానీ, నగరంలో అంతర్భాగంగా గల కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ ప్రాంతాలు మాత్రం ఇప్పటికి వరద ముంపు ప్రాంతాలుగా ఉన్నాయి. వీటిని నియంత్రిచడానికి “రిటైనింగ్ వాల్” నిర్మిస్తామని ఎన్నికల సందర్భంలో ప్రతి పార్టీ చెప్పుకొచ్చింది. గతంలో వైయస్ హయంలో వరుసగా మూడు సంవత్సరాలు వరద రావడంతో తక్షణమే పనులు చేపడతామని హామీ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు చంద్రబాబు తొమ్మిదేళ్ళ పాలనలో కూడా ఇలాంటి హామీని ఇచ్చింది కానీ నేరవేర్చలేకపోయింది.

ఇలా నోటి మాటలకే పరిమితమైన దీనిని ప్రస్తుత చంద్రబాబు సర్కార్ కార్యరూపంలో పెడుతోంది. ఈ దిశగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు ఒక ప్రకటన చేసారు. త్వరలోనే కరకట్ట వెంబడి “రిటైనింగ్ వాల్”కు ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తామని, భవిష్యత్తులో వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసే బాధ్యతను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుదని హామీ ఇచ్చారు. దీంతో ముంపు ప్రాంతాల వాసులు హర్షం వ్యక్తం చేసారు.

వైయస్ చనిపోయిన తర్వాత రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్నూల్ నగరం ముంపుకు గురైనపుడు విజయవాడ వాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాదాపు 20 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీకు చేరుకోవడంతో కర్నూలుకు పట్టిన గతే విజయవాడకు కూడా పడుతుందా అని కలత చెందారు. అయితే “రిటైనింగ్ వాల్” నిర్మాణంతో ఎంతటి వరద నీరు వచ్చినా కూడా నగర వాసులు భయపడాల్సిన పని లేదని నిపుణులు చెబుతున్నారు.