Vijayawada Airport2035 నాటికి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో టాప్ 10 లిస్టులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రెండు నగరాలు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ నుండి విజయవాడ, తెలంగాణ నుండి హైదరాబాద్ ఈ లిస్టులో ఉంటాయని వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది. ఆక్సఫర్డ్ ఎకనామిక్స్ చేసిన ఈ సర్వే ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లోనాలుగో స్థానంలో హైదరాబాద్, తొమ్మిదవ స్థానంలో విజయవాడ ఉన్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని సూరత్ మొదటి స్థానంలో ఉండటం గమనార్హం. సూరత్ ఆ రాష్ట్ర రాజధాని కంటే వేగంగా అభివృద్ధి చెందుతుండటం విశేషం. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తాజ్ మహల్ ఉన్న ఆగ్రా ఈ లిస్టులో రెండో స్థానంలో ఉంది. దేశంలోనే ఐటీకి ప్రసిద్ధి చెందిన బెంగళూరు మూడవ స్థానంలో ఉంది. దక్షిణాదిన ఉన్న నగరాలలో బెంగళూరు మిగిలిన వాటికంటే ముందు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నగరమైన విశాఖపట్నం ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.

బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తప్ప టాప్ 10 లో ఉన్న మిగతా నగరాలు అన్నీ ఆయా రాష్ట్రాల రాజధానులు కాకపోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా 780 నగరాలను సర్వే చేశారు. ప్రపంచంలోనే టాప్ – 10 నగరాలలో అన్నీ మన దేశానికే చెందిన నగరాలు కావడం దేశం ప్రగతిపథంలో నడుస్తుంది అనే దానికి నిదర్శనం. అదే సమయంలో ఆసియా పశ్చిమ దేశాలను అధిగమిస్తుంది అనే దానికి ఇదే నిదర్సనం అని ఈ సర్వే చేసిన ఆక్సఫర్డ్ ఎకనామిక్స్ అభిప్రాయపడింది.