vijayashanti may join bjpరాములమ్మగా, లేడీ అమితాబ్ గా తెలుగు తెరను ఒక ఊపు ఊపిన విజయశాంతి ఆ తరువాత రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొదట్లో సొంత పార్టీ పెట్టి ఆ తరువాత దానిని తెరాసలో వినీనం చేశారు. ఆ తరువాత తెలంగాణ సాధనకు తనదైన పాత్ర పోషించి సరిగ్గా తెరాస అధికారంలోకి వచ్చే సమయంలో కాంగ్రెస్ లో చేరి ప్రతిపక్షంలో ఉండిపోయారు.

ఆ ప్రకారం ఆమె ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండిపోయారు. తాజాగా ఆమె పార్టీ మారానని నిర్ణయించుకున్నారట. ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి విజయశాంతిని కలిశారు. దాదాపుగా గంటపాటు చర్చించారు. ఈ చర్చల తరువాత బండి సంజయ్ అరెస్ట్‌ను ఆమె ఖండించారు. దీంతో విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ తరపున విజయశాంతి ప్రచారం చేయడం లేదు. కనీసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కూడా ఆమె ఎక్కడా కోరడం లేదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. దుబ్బాక ఉప ఎన్నికల తరువాత ఆమె కాంగ్రెస్ కండువా పక్కనపెట్టి కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు… సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా సినిమాలలోకి విజయశాంతి రీఎంట్రీ ఇచ్చారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఆ పాత్రతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అయినా మునుముందు తనకు సినిమాలలో నటించే అవకాశం లేదని ఆమె కొన్ని ఇంటర్వ్యూలలో తేల్చి చెప్పారు.