vijayashanti mahesh babuరాములమ్మగా, లేడీ అమితాబ్ గా తెలుగు తెరను ఒక ఊపు ఊపిన విజయశాంతి ఆ తరువాత రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారు. తెరాసలో తెలంగాణ సాధనకు తనదైన పాత్ర పోషించి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. అయితే అప్పటి నుండి ఆమెకు కలిసి రావడం లేదు. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా సినిమాలలోకి విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.

ఈ సినిమాలో ఆమె పాత్ర గురించి విజయశాంతి ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు చెప్పారు. “ఈ సినిమాలో నా పాత్రకు, మహేష్ బాబు పాత్రకు రిలేషన్‌ ఏమీ ఉండదు. కానీ మా పాత్రలు రెండూ ప్యారలల్‌గా వెళ్తుంటాయి. నేను పాజిటివ్‌ పర్సన్‌. చేసే పాత్రలూ అలానే ఉండాలని కోరుకుంటాను. ఇందులో నాది చాలా పాజిటివ్‌ పాత్ర. అందరికీ నచ్చుతుంది. నాకు డబ్బులు ముఖ్యం కాదు. స్క్రిప్ట్, డైరెక్టర్‌ అన్నీ కుదరాలి,” అని ఆమె చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో అమ్మ, వదిన.. పాత్రలు చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు కూడా ఆమె ససేమిరా అన్నారు. “నో. చాన్సే లేదు. డిఫరెంట్‌ పాత్రలుంటే చేస్తా. అమ్మ అయినా ‘మదర్‌ ఇండియా’ లాంటి పాత్ర అయితే చేస్తా. విజయశాంతి అంటే ఆడియన్స్‌కి అంచనాలుంటాయి. మామూలు సినిమాలు చేస్తే ఎలా? కెపాసిటీ ఉండి చేయకపోవడం ఎందుకు?,” అని ఆమె చెప్పడం విశేషం. సరిలేరు నీకెవ్వరూ షూటింగ్ జులై మొదటి వారంలో మొదలు అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్రయత్నంలో ఉంది చిత్ర బృందం.