Vijayashanti - Sarileru Neekevvaruఒక‌ప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన విజ‌య‌శాంతి రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత సినిమాల్లో న‌టించ‌లేదు. దాదాపుగా 13 ఏళ్ళ త‌ర్వాత మ‌హేశ్ బాబు నటిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం ద్వారా విజ‌య‌శాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. భార‌తి అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో విజ‌య‌శాంతి క‌న‌ప‌డ‌నున్నారు.

దీనికి సంబంధించిన లుక్‌ను చిత్ర యూనిట్ దీపావ‌ళి సంద‌ర్భంగా విడుదల చేసింది. విజ‌య‌శాంతి పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఆమె లుక్ రాయల్ గా ఉంది. అలాగే సినిమాలో ఆమె రోల్ చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు. లేడీ సూప‌ర్‌స్టార్‌, లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈజ్ బ్యాక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న సినిమా విడుద‌ల‌వుతుంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల అల వైకుంఠపురములో కూడా అదే రోజున వస్తుంది. మరోవైపు ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. వచ్చే నెల మొదటి వారంలో చిత్ర బృందం కొత్త షెడ్యూల్ కు కేరళ వెళ్లబోతుంది. రష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది.

అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి దిల్‌రాజు, అనిల్ సుంక‌ర నిర్మాత‌లు. అనిల్ ఈ ఏడాది సంక్రాంతికి ఎఫ్2 వంటి అతిపెద్ద హిట్ ఇచ్చారు. దానితో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే సాయంత్రం ఈ చిత్రానికి సంబంధించిన మరో పోస్టర్ చిత్రబృందం విడుదల చెయ్యబోతుంది.