vijayashanthi-joins-bjpకాంగ్రెస్‌ ప్రచారకమిటీ ఛైర్‌పర్సన్‌ విజయశాంతి బీజేపీలో చేరారు. జీహెచ్ఎంసి ఎన్నికలకు ముందే ఆమె బీజేపీలో చేరాల్సి ఉంది. అయితే మోడీ సమక్షంలోనే చేరతా అని ఆమె చెప్పారట. తనకు ఆయనే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాలని ఆమె అడగడంతో ఎన్నికలప్పుడు అది కుదరక చేరిక వాయిదా పడింది.

అయితే జీహెచ్ఎంసి ఎన్నికలలో బీజేపీ అనూహ్య ఫలితాలు రాబట్టడంతో ఇక డిమాండ్స్ కు ఆస్కారం లేదని రాములమ్మకు అర్ధం అయినట్టు ఉంది. దానితో తన డిమాండ్ ని పక్కన పెట్టి ఢిల్లీ వెళ్లారు. కనీసం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరదామన్నా అది కూడా సాధ్యం కాలేదు.

అయితే అమిత్ షాని మర్యాదపూర్వకంగా కలవడం మాత్రం ఎలాగో సాధ్యపడింది. దానితో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కాషాయ కండువాను కప్పి అరుణ్‌ సింగ్‌ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ నుంచి విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ తరువాత సొంత పార్టీ పెట్టి… కొన్ని రోజుల తరువాత దానిని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. అనంతరం కేసీఆర్ తో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ కి కూడా గుడ్ బై చెప్పి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి ఆమె సొంత గూటికి చేరుతున్నారు.