MP-Vijay-Sai-Reddy-వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. రాజ్యసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు దాని ఛైర్మన్‌ అందుబాటులో లేనట్లయితే ఆయన స్థానంలో సభ నిర్వహించేందుకు వైస్ ఛైర్మన్‌ ప్యానల్‌ని ఏర్పాటు చేస్తారు. ఈ నెల 5వ తేదీన విజయసాయి రెడ్డితో సహా మొత్తం 8 మందితో కూడిన రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్‌ల జాబితాలో చేర్చుతూ రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్ ఓ జాబితాని విడుదల చేశారు.

అందుకు విజయసాయి రెడ్డి ఎంతో సంతోషిస్తూ ఆ జాబితాను టాగ్ చేస్తూ తననురాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్‌ల జాబితాలో చేర్చినందుకు రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్యానల్ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ, రాజ్యసభ నిర్వహణకి తన వంతు పూర్తి సహాయసహకారాలు అందజేస్తానని ట్వీట్ చేశారు. ఆయన ఈ ప్యానల్ సభ్యుడిగా ఎన్నికైనందుకు వైసీపీ నేతలు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్స్ చేశారు కూడా.

కానీ మూడు రోజులలో ఏం జరిగిందో తెలీదు కానీ ఆ జాబితాలో నుంచి ఒక్క విజయసాయి రెడ్డి పేరు మాత్రం తొలగించారు. బిజినస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి పంపిన ఆహ్వానపత్రంలో కూడా విజయసాయి రెడ్డి పేరు కనిపించలేదు. బుదవారం మధ్యాహ్నం రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్ ధన్‌ఖడ్‌ మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ప్యానల్ వైస్ ఛైర్మన్‌ల ప్యానల్‌లో చిన్న మార్పు చేశామని చెపుతూ దానిలో భువనేశ్వర్ కలితా, ఎల్.హనుమంతయ్య, సస్మిత్ పాత్ర, సురేంద్రసింగ్ నాగర్, తిరుచ్చి శివ, సరోజ్ పాండే, సుఖేందు శేఖర్‌ రాయ్ సభ్యులుగా ఉంటారని ప్రకటించారు. అంటే విజయసాయి రెడ్డి ఒక్కరి పేరు మాత్రమే ఆ జాబితాలో నుంచి తొలగించినట్లు స్పష్టమయ్యింది. ఆ ప్రకారమే రాజ్యసభ రికార్డులలో కొత్త ప్యానల్ సభ్యుల పేర్లు నమోదయ్యాయి కూడా. దీంతో విజయసాయి రెడ్డి షాక్ అయ్యారు.

అసలు అక్రమాస్తుల కేసులలో జైలుకి వెళ్ళి వచ్చి నేటికీ ఆ కేసుల్లో సీబీఐ కోర్టు చుట్టూ తిరుగుతున్న విజయసాయి రెడ్డిని గౌరవప్రదమైన పెద్దల సభకి పంపించడమే చాలా తప్పని వాదించేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఏళ్ళ తరబడి సాగుతున్న ఆ కేసులలో విజయసాయి రెడ్డిని న్యాయస్థానం దోషిగా నిర్ధారించలేకపోతుండటంతో ఆయన కేవలం నిందితుడిగానే ఉన్నారు. రాజకీయాలలో ఉన్నవారు దోషిగా నిరూపించబడనంత వరకు నిర్ధోషిగానే పరిగణించే వెసులుబాటు ఉన్నందున విజయసాయి రెడ్డి కూడా పెద్దల సభలో అడుగుపెట్టడమే కాకుండా ఒకసారి పెద్దల సభని వైస్ ఛైర్మన్‌ హోదాలో నడిపించారు కూడా.

అప్పుడు ఏపీలో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. బహుశః అందుకే చివరి నిమిషంలో ఆయన పేరును జాబితా నుంచి తొలగించి ఉండవచ్చు. కానీ ట్విట్టర్‌లో గొప్పగా ప్రకటించుకొన్న తర్వాత ఇలా జరగడం వలన విజయసాయి రెడ్డికి మరింత అవమానకరంగా మారిందని చెప్పవచ్చు. అత్త కొట్టినందుకు కాదు… తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నా అన్నట్లు పదవి పోయినందుకు కాదు టిడిపి, జనసేనలు అవహేళన చేస్తాయని బాధపడుతుండవచ్చు.