Vijayasai Reddyప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో గత ఏడాది అక్టోబరులో జరిగిన కోడి కత్తి దాడిపై కుట్రకోణం ఉందని ఆరోపిస్తూ పట్టుబట్టి ఎన్ఐఏ దర్యాప్తు సాధించుకుంది ఆ పార్టీ. ఎన్ఐఏ దర్యాప్తులో ఏదైనా కుట్ర కోణం బయటపడితే ఎన్నికల వేళ తమకు రాజకీయంగా లబ్ది చేకూరుతుందని వారి ఆశ. అయితే ఇది మొత్తానికి తిరగబెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీటులో ఇది చిన్న గాయమే అని దర్యాప్తు సంస్థ చెప్పుకొచ్చింది.

ఇదే విషయాన్నీ రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఒక ప్రశ్న రూపంలో వేశారు. ‘‘ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన ఘటన గురించి కేంద్రానికి తెలుసా? ఒకవేళ తెలిస్తే… ఈ దారుణమైన దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని కనుక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నించిందా? దీనిపై ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకున్నారు? ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వానికున్న అడ్డంకులేంటి’’ అని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.

అయితే కేంద్రం ఇచ్చిన సమాధానంతో క్లీన్ బౌల్డ్ అయ్యారు. కేంద్రమంత్రి స్పందిస్తూ ‘‘2018 అక్టోబర్‌ 25వ తేదీన విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్‌ ఫుడ్‌రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది ఒకరు జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిచేశారు. ఆయనకు చిన్నగాయమైంది. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును ఎన్‌ఐయేకి అప్పగించాం’’ అని బదులిచ్చారు. దీని బట్టి త్వరలో ఈ కేసు గనుక తుది తీర్పు వరకూ వెళ్ళి ఇదే మాట కోర్టు కూడా చెబితే అది వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు ఇబ్బందికర పరిస్థితిగా మారొచ్చు.