Vijaya_Sai_Reddy_YCPజగన్ ప్రభుత్వ విశాఖలో పరిపాలనా కేంద్రం అనే రంగుల కల అనేక మలుపులు తిరిగి అక్కడ జరుగుతున్న భూకుంభకోణాల వద్దకు వచ్చింది. వాటికి వెనక ఉన్నది ఉత్తరాంద్రను మూడేళ్ళుగా తన కనుసన్నలలో నడిపిస్తున్న అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడి కుటుంబం, అతని సన్నిహితులే అనే ఆరోపణలు తిరుగుతున్నాయి. గత వారం రోజుల్లో ప్రముఖ తెలుగు, ఆంగ్ల పత్రికల్లో ప్రదాన వార్తలుగా జనాల నోళ్లలో నానుతున్నాయి. అధికార పార్టీలో నెం.2 గా ఉన్న విజయసాయి రెడ్డి కేంద్రంగా ఇన్ని వేలకోట్ల ఆరోపణలు వచ్చినా ఆ పార్టీ నుంచి అధికార ప్రతినిధులు కానీ, విశాఖ, ఉత్తరాంధ్ర నాయకులు గానీ ఒక్కరు కూడా సాయి రెడ్డికి అనుకూలంగా ఆరోపణలు ఖండించకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

వైసిపి అధికారంలోకి వచ్చిన మెుదటి రెండు సంవత్సరాలు సాయిరెడ్డే ఉత్తరాంధ్ర, ఉత్తరాంధ్రే సాయిరెడ్డి అన్నట్లుగా వ్యవహారాలు జరిగాయి, అక్కడ చీమ చిటుక్కుమనాలన్నా సాయిరెడ్డి అనుమతి కావాలని చెప్పుకునేవారు. ఆ ప్రాంతంలో నాయకులు, అధికారులు ఆయన కనుచూపు తనమీద పడితే చాలనుకునేవారు. ఆయన మీద ఈగ వాలితే సంహించేవారు కాదు. నలుదిక్కుల నుండి ఎదురుదాడి చేసేవారు. అటువంటిది పరిస్ధితి నుండి, కనీసం ఒక్క ద్వితీయ శ్రేణి నాయకుడు కూడా ముందుకు వచ్చి భూకుంభకోణ ఆరోపణలన్ని ఖండించకపోవడం, పార్టీ కూడా తమకు సంబంధం లేదన్నట్టుగా గమ్మున ఉండటం, చివరకు సాయి రెడ్డే మీడియా సమావేశం పెట్టుకుని తన కుటుంబంపై వచ్చిన ఆరోపణల్ని ఖండించుకోవలసి రావడం, తన కుమార్తె ఇంటి పేరు మారింది కనుక తనకు సంబంధంలేదనే విదంగా గందరగోళ వాదన చేయడం నిజంగా వింత పరిణామాలు.

కానీ గత సంవత్సర కాలం నుండి అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారికి ఇవి పెద్ద ఆశ్చర్యం కలిగించడంలేదు. ఒక ప్రణాళిక ప్రకారం పార్టీలో సాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గించే కార్యక్రమాలు జరుగుతన్నాయనే చెబుతున్నారు. కోవిడ్ సమయంలో విశాఖలో ఓ ప్రమాదం జరిగితే పరామర్శకు వెళుతున్న ముఖ్యమంత్రి కారు నుండి సాయిరెడ్డిని దించేయడం, అత్యంత సెక్యూరిటీ ఉన్న ప్రాంతంలో జరిగిన ఆ సంఘటన వీడియో సోషల్ మీడియాల్లో రావడం దగ్గర నుంచి, ఆయనను విశాఖ పరిధిలోనే కట్టడి చెయ్యడం, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తికి పార్టీ ఆఫీసులో సోషల్ మీడియా వంటి చిన్న భాద్యత ఇవ్వడం, తరువాత దానిని కూడా అధినేతకు దగ్గరగా ఉండే మరొక ముఖ్యుడి తనయుడి చేతిలో పెట్టడం ఇలా వరుస పరిణామాలతో సాయిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మామూలుగా ఓ ద్వితీయ శ్రేణి పార్టీ నాయకుడిపై రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తే విరుచుకు పడే వైసిపి సోషల్ మీడియా శ్రేణులు, కొత్త ఇంచార్జి బాద్యతలు తీసుకున్న నేపథ్యంలో ఈ భూకుంభకోణ ఆరోపణల విషయంలో సోషల్ మీడియాలో కూడా ఆయన దగ్గరి వ్యక్తులు, వారి ఫాలోవర్లు తప్ప పెద్దగా స్పందించలేదు. పుండు మీద కారంలా విశాఖ అధికార పార్టీ యంపి మీడియా ముఖంగా సాయిరెడ్డి మీద ఆరోపణలు గుప్పించి చాలెంజ్ విసరడం మరింత ఆశ్చర్యపరిచే పరిణామం. అధినాయకత్వం ఆశీస్సులు లేకుండా సాయిరెడ్డి వంటి అగ్రనాయకుడిపై ఒక మామూలు యంపి ప్రెస్ ముందు ఆరోపణలు చేసే ధైర్యం చెయ్యలేరనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి, వైసిపి అధినాయకత్వానికి సన్నిహితంగా ఉండే ఇదే వర్గానికి చెందిన యాజమాన్యం చేతిలో ఉండే ఓ ఆంగ్ల పత్రిక కూడా సాయిరెడ్డి పై వరస కదనాలు ప్రచురించడం కూడా ఆయనకు పొగ పెడుతున్నారే దానికి ఓక ఉదాహరణలా చెబుతున్నారు. జగన్ మెూహన్ రెడ్డి గురించి అన్ని విషయాలు కూలంకషంగా తెలిసి, ఆయన కేసుల్లో సహనిందితుడిగా ఉండి, ఆర్ధికంగా బలమైన అండదండలు, ఢిల్లీ స్ధాయిలో పరిచయాలు మెండుగా ఉన్న సాయిరెడ్డి, ఈ పరిణామాలను ఎలా ఎదుర్కుంటారో వేచి చూడాల్సిందే!

శ్రీకాంత్.సి