Vijayasai Reddy declares vizag as andhr pradesh capitalప్రపంచమంతా రెండో విషయం గురించి మర్చిపోయి కరోనా బెడద ఎప్పుడు వదులుతుంది.. ఆ తరువాత ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి అనేదాని మీదే ఆలోచిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అక్కడి అధికార పార్టీ రూటే వేరు. కరోనా సంగతి ఎలా ఉన్నా… ముందు స్థానిక ఎన్నికలు, రాజధాని మార్పిడి అదే ముఖ్యం వారికి.

తాజాగా మంగళవారం నాడు విశాఖలో మీడియా మీట్ నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయి రెడ్డి నవ్యాంధ్ర రాజధానులపై మరోసారి కీలక ప్రకటన చేశారు. “విశాఖ రాజధానిగా వచ్చి తీరుతుంది. దాన్ని ఆపే శక్తి ఎవరికి లేదు. అది ఎప్పుడు అన్నది త్వరలో నిర్ణయం ఉంటుంది” అని ఆయన ప్రకటించారు.

ఇటువంటి సమయంలో కూడా రాజకీయాలే పరమావధి కావడం దురదృష్టకరం. ఈ సందర్భంగా ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

సామజిక దూరం అనేది పాటించకుండా పోటీ పడి ఫోటోలకు ఫోజులిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు. ఇది ఇలా ఉండగా… గడిచిన 24 గంటలలో ఆంధ్రప్రదేశ్ లో మరో 35 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. రాష్ట్రంలోని మొత్తం కేసులలో 45% కేసులు కర్నూల్, గుంటూరు జిల్లాలలోనే నమోదు అయ్యాయి.