Vijaya-Shanthi-BJPసినిమాలు చేస్తున్నప్పుడు కానీ, ఆ తర్వాత రాజకీయాలలో కొనసాగుతున్నప్పుడు గానీ విజయశాంతి ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు పొందుతూనే ఉన్నారు. కానీ తెలంగాణ బిజెపిలో చేరిన తర్వాత సుమారు రెండేళ్ళు ఆమె పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండిపోయారు. కరోనా, లాక్‌డౌన్‌ల వలన కొంతకాలం ఇంటికే పరిమితం అయినప్పటికీ, తాను రాజకీయాలలో యాక్టివ్‌గానే ఉండాలనుకొంటున్నానని కానీ పార్టీ పట్టించుకోవడం లేదని విజయశాంతి చాలా స్పష్టంగా చెప్పారు.

అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడు సర్వాయి పాపన్న జయంతి వేడుకలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు చాలా రోజుల తర్వాత ఆమె ఇవాళ్ళ మీడియా ప్రతినిధులతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు “మిమ్మల్ని పార్టీ సైలెంట్ మోడ్‌లో పెట్టిందా లేక మీరే సైలెంట్ మోడ్‌లో ఉన్నారా? పార్టీ కార్యక్రమాలలో ఎందుకు చురుకుగా పాల్గొనడం లేదు?” అని ప్రశ్నించారు.

అప్పుడు విజయశాంతిలో దాగిన ఆగ్రహావేశాలు బయట పడ్డాయి. కానీ ఆమె చక్కగా చిర్నవ్వులు నవ్వుతూనే తెలంగాణ బిజెపి అధిష్టానం తనతో వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

“నిజమే… కరోనా అందరినీ పలకరించినట్లే మా ఇంటికి కూడా వచ్చి మమ్మల్ని కూడా పలకరించింది. దాంతో కొన్ని రోజులు ఇంటిపట్టునే ఉండిపోయాను. కానీ ఆ తర్వాత పార్టీ నాకు ఎటువంటి బాధ్యతలు అప్పగించలేదు. నా సేవలు ఎందుకు ఉపయోగించుకోవడం లేదో… నన్ను ఎందుకు సైలెంట్ మోడ్‌లో పెట్టారో నాకు తెలీదు కనుక నేను చెప్పలేను. కనుక మీడియా మిత్రులు మీరే వెళ్ళి మా రాష్ట్ర పార్టీ అధిష్టానాన్ని అడిగి తెలుసుకొని నాకు చెప్పండి. చాలా సంతోషిస్తాను. నాకు పనులు అప్పజెప్పకుండా ఏదో చేయాలని ఆశిస్తే నేనేమీ చేయగలను?ఫలానా పని అని ఏదైనా అప్పజెపితే కదా చేయగలను?

మునుగోడు ఉపఎన్నికలు వస్తున్నాయి. వాటికి ఇంకా చాలా టైమ్ ఉంది. అందరం కలిసికట్టుగా పనిచేస్తే తప్పకుండా గెలుస్తామనే నమ్మకం నాకుంది. ఇవాళ్ళ కూడా నేను మాట్లాడుదామనే అనుకొన్నాను. కానీ లక్ష్మణ్‌గారు వచ్చి మాట్లాడివెళ్ళిపోయారు. ఇక నేనేమి మాట్లాడేది?నాకు అవకాశం ఇస్తే నేను ఎప్పుడూ రాములమ్మలాగ ధీటుగానే స్పందిస్తాను. కానీ వద్దనుకొని పక్కన పెట్టేసే నేనేమి చేయగలను?పార్టీలో నా పాత్ర లేకుండా చేయాలనుకొనేవారినే పాతర (గొయ్యి తీసి కప్పెట్టడం) వేయాలి” అని అన్నారు.