Vijaya Sai Reddy  Warns ysrcp leaders on discipline అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ కు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవలే పార్టీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు బీజేపీతో సక్యతతో మెలుగుతూ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. విజయ సాయి రెడ్డి లేకుండా కేంద్ర మంత్రుల దగ్గరకు వెళ్లకూడదని జగన్ హుకుం జారీ చేసినా ఆయన వినలేదు.

నిన్న జగన్ కు అపాయింట్మెంట్ ఇవ్వని అమిత్ షా రఘురామ కృష్ణం రాజుని కలవడం విశేషం. ఇది ఇలా ఉండగా నెల్లూరు జిల్లాలో పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కాకాని గోవర్దన్ రెడ్డి కి ఉన్న స్పర్ధలు పలుమార్లు బయటపడ్డాయి. నిన్న మరో సీనియర్ నేత ఆనం రామ్ నారాయణ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని రచ్చ కీడ్చారు.

నెల్లూరు లో లేని మాఫియా ఉందా అంటూ జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను టార్గెట్ చేశారు. పార్టీలో ఈ రచ్చతో విసుగుచెంది విజయ సాయి రెడ్డి మీడియా ముందే పార్టీ నేతలను హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ పార్టీకి విధేయత, క్రమశిక్షణ ముఖ్యమని, ఎవరు గీత దాటిన సహించే ప్రసక్తే లేదని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఆయన శనివారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..సమస్యలుంటే పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకురావాలని.. మీడియా ముందుకు తీసుకువస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో ఎంతటి వారైనా గీత దాటితే చర్యలు తప్పవన్నారు. అయితే ఈ హెచ్చరికలతో పరిస్థితి చక్కబడుతుందా?