Vijaya Sai Reddy visakhapatnamగత నెలలో వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ సమయానికి ఆయన విజయవాడ లో ఉన్నారు. ఉన్నఫళంగా ఒక ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లి అక్కడి కార్పొరేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈ మధ్యనే కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇది ఇలా ఉండగా… ఆయన ఈరోజు హుటాహుటిన విశాఖపట్నం చేరుకున్నారు.

అది కూడా మరో ప్రత్యేక విమానంలో. ఆంధ్రప్రదేశ్ కు కాబోయే కార్యనిర్వాహక రాజధానిలోని పార్టీ కార్యాలయం దగ్గర జండా ఎగురేసి పార్టీ పనులలో కూడా పాల్గొన్నారు. అయితే ఇంత హుటాహుటిన ప్రత్యేక విమానంలో ఎందుకు విశాఖ వచ్చారు అని అంతటా చర్చ జరుగుతుంది.

అసలైతే ప్రభుత్వం రేపు విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధానికి శంకుస్థాపన చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోవడంతో వెనక్కు తగ్గింది. తదుపరి హియరింగ్ వరకు రాజధాని తరలింపులో యథాస్థితి కొనసాగించాలని హై కోర్టు తాజాగా ఆదేశించింది.

దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుని ఆశ్రయించే పనిలో ఉంది. ఎలాగైనా విజయదశమి నాటికి పరిపాలన అంతా విశాఖ నుండే సాగించాలని ముఖ్యమంత్రి జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారట. ఆ లోగా కోర్టు కేసులు అన్నీ పరిష్కారం అయ్యి… తరలింపు పూర్తి అవుతుందా అనేది చూడాలి.