Vijaya-Sai-Reddyరాజధాని రైతులు అమరావతిని రాజధానిగా చేయాలని కోరుతూ అరసవిల్లికి మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో వారి పాదయాత్ర విశాఖపట్నం చేరుకోనుంది. కనుక వారికి వ్యతిరేకంగా విశాఖ ప్రజలను రెచ్చగొట్టేందుకు వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలోనే ఇటీవల విశాఖ వైసీపీ నేతల రాజకీయ హడావుడి బాగా పెరిగిపోయింది. విశాఖ రాజధానిని చేయాలని కోరుతూ జెయేసీ సమావేశాలు, రాజీనామా డ్రామాలు మొదలుపెట్టారు.

అయితే తెలుగు మీడియా సంస్థలు వారి ప్రతిపాదన వెనుక అసలు రహస్యాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాయి. వైసీపీలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి తన అల్లుడు, కూతురు పేరిట విశాఖపట్నంలో కోట్లు విలువచేసే దసపల్లా భూములను ఏవిదంగా కొట్టేశారో ఆ పత్రికలు వివరించాయి. ఉత్తరాంద్రాలో కోట్లు విలువైన భూములను ఆక్రమించుకొనేందుకే వైసీపీ నేతలు విశాఖ రాజధాని, అధికార వికేంద్రీకరణ అంటూ డ్రామాలు ఆడుతున్నారని టిడిపి నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నా వైసీపీ నేతలు ‘తగ్గేదేలే..’ అంటున్నారు.

మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ, “బాలకృష్ణ కూతురు బ్రాహ్మణి ఎక్కడైనా భూములు కొంటే ఆయనకేమి సంబందం?అలాగే ఆ కూతురు, అల్లుడు భూములు కొంటే నాకేం సంబందం?” అని ట్వీట్ చేశారు.

అంటే విజయసాయి రెడ్డి లేదా ఆయన అల్లుడు, కూతురు కోట్లు విలువచేసే దసపల్లా భూములు చేజిక్కించుకొన్నారని స్పష్టం అయ్యింది. నిజమే.. ఆయన బంధువులు ఎవరో ఎక్కడెక్కడో భూములు కొంటే ఆయనకు ఎటువంటి సంబంధమూ లేదు. ఉండదు కూడా. కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు అమరావతిలో ఇన్‌-సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన విజయసాయి రెడ్డి, ఇప్పుడు చేసినది అదే కదా? విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు తమ ప్రభుత్వం నిర్ణయించగానే ఆయనతో సహా పలువురు వైసీపీ నేతలు విశాఖలో భూములు చేజిక్కించుకోవడం కూడా ఇన్‌-సైడ్ ట్రేడింగే కదా?

నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సముద్రతీరాన్న గల పచ్చటి ఋషికొండను ఇష్టం వచ్చిన్నట్లు తవ్వేసుకొని భవనాలు నిర్మిస్తుండటమే ఇందుకు మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అందుకే జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలు, ప్రజాస్వామ్యం, ప్రజలు అంటే గౌరవం లేదని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపిస్తున్నారనుకోవచ్చు.