Vijaya- Sai -Reddyకేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధాని నరేంద్ర మోడీ రెండో టర్మ్ లో మొదటి బడ్జెట్ కాసేపటి క్రితం సభలో ప్రవేశపెట్టారు. అయితే బడ్జెట్‌పై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పెదవి విరిచారు. బడ్జెట్‌ నిరాశపరిచిందని, ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదని ఆయన అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపించిందని, బడ్జెట్‌లో విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కి అదనంగా ఇచ్చిందేమీ లేదన్నారు.

విశాఖ, విజయవాడ మెట్రో రైలుకు నిధుల విషయంలోనూ అన్యాయం జరిగిందని, బడ్జెట్‌లో ఏపీకి ఒరిగింది సున్నా అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా కేటాయింపులు ఉంటాయని ఎవరూ అనుకోలేదు. మరి వైఎస్సార్ కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వాలకు అటువంటి అంచనాలు ఏమైనా ఉన్నాయేమో తెలీదు.

గతంలో కేంద్ర బడ్జెట్ పెట్టినప్పుడల్లా అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించింది. కేంద్రం నుండి బయటకు రావాలని, మంత్రులతో రాజీనామాలు చేయించాలని, ఆ తరువాత అవిశ్వాస తీర్మానం, రాజినామాలని వైఎస్సార్ కాంగ్రెస్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాకా కేంద్రం మీద వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి పెడుతుందో? పైగా విజయసాయి రెడ్డి గారికి ప్రధానితో విజయ్ గారు అని ఆప్యాయంగా పిలిపించుకునే అంత చనువు ఉంది. మళ్ళీ రాజీనామాలకు సిద్ధ పడతారో లేక జగన్ మొన్న ఈ మధ్య చెప్పినట్టు సర్ ప్లీజ్ సర్ ప్లీజ్ అని కనిపించినప్పుడల్లా అడగడంతోనే సరిపెడతారో చూడాల్సి ఉంది.