vijaya-Sai-Reddy-says-Amit shah is another Vallabhai Patelజమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్రం తీసుకున్న ఈ చర్యను స్వాగతిస్తూ… ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను మరో సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా కీర్తించారు ఆయన.

ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్‌షాకు హ్యాట్సాఫ్ చెబుతున్నట్లు రాజ్యసభలో విజయసాయి వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడ్డాయని ఆయన చెప్పారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి తమ పార్టీ మద్దతు, జగన్మోహన్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు ఎందుకు ఉండాలని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి రెండు జాతీయ పతాకాలు ఎందుకు ఉండాలని నిలదీశారు.

కశ్మీరీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఒక పాకిస్థానీ భారత పౌరుడు ఎలా అవుతాడని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఆయన విమర్శించడం గమనార్హం. జమ్మూ, కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్‌ సైన్యం ప్రయత్నించినపుడు భారత సైన్యం పాక్‌చొరబాటును తిప్పికొడుతూ దాదాపు 25 కిలోమీటర్లు పాక్‌భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నారు. ఆనాడు భారత సైన్యాన్ని వెనక్కి రప్పించి నెహ్రూ చారిత్రక తప్పిదం చేయలేదా అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. అందువల్లే నేడు ఈ దుస్థితి దాపురించిందని, తాత్కాలికమైన ఈ ఆర్టికల్‌370ని కాంగ్రెస్‌ ప్రభుత్వం రద్దు చేసి ఉంటే ఈరోజు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.