Vijaya Sai Reddy  Padayatra for Vizag steel plantగ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చే నెల 10న జరగనుండడంతో అధికార పక్షం మేల్కొంది. ఇప్పటివరకు పట్టించుకోని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని ఉన్నఫళంగా తలపైకి ఎత్తుకుని ప్రజలను ఇంప్రెస్ చేసే పనిలో పడింది. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 20న విజయసాయి రెడ్డి పాదయాత్ర చెయ్యనున్నట్టు ప్రకటించింది.

ఉక్కు కార్మికుల ఆందోళనకు మద్దతుగా జీవీఎంసీ నుంచి కూర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ గేటు వరకు 22 కి.మీ మేర యాత్ర చెయ్యనున్నట్టు ప్రకటించారు. అయితే ఇటీవలే పార్లమెంట్ సమావేశాలలో కనీసం దీనిపై చర్చకు పట్టుబట్టడం కానీ సభను స్తంభింప చెయ్యడం గానీ చెయ్యలేదు. ముఖ్యమంత్రి జగన్ ఏదో ఒక ఉత్తరం రాసి సరిపెట్టారు.

“ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఏదో నామ్ కే వాస్తే గా విజయసాయి రెడ్డితో పాదయాత్ర చేయిస్తున్నారు. కేంద్రంలోని పెద్దలకు నొప్పి కలగకుండా అదే సమయంలో ఏదో చేస్తున్నాం అని ప్రజలకు భ్రమ కలిపించేలా కార్యక్రమాలు చేస్తున్నారు,” అని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి

మరోవైపు… ఈ అంశం పై వారం నుండి ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావు దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించింది ప్రభుత్వం. ఈరోజు పల్లాను చూడటానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానుండడంతో మీడియా అటెంషన్ ఎక్కువగా వచ్చి టీడీపీకి మైలేజ్ వస్తుందేమోననే కంగారుతోనే దీక్షను భగ్నం చేసారని టీడీపీ వారు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ ఇన్ని రాజకీయ లెక్కలతో ముందుకు సాగితే కేంద్రం దిగివచ్చే అవకాశమే లేదు, అప్పటి వరకూ ఏపీ పరిస్థితి ఇంతే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.